Prapul patel achieved four crore turnover with chai business
mictv telugu

చాయ్‌తో కోట్ల సంపాదన.. చదువుకున్న నిరుద్యోగి కథ

July 23, 2022

Prapul patel achieved four crore turnover with chai business

దేశంలో చదువుకున్న యువతకు కొదవ లేదు. అయితే వారందరూ ఉద్యోగాల కోసం ఎగబడేవారే. ఎందుకంటే వారికి ఉద్యోగం చేయడం తప్ప వ్యాపారం చేయడానికి ఆర్ధిక పరిస్థితులు అనుకూలించవు. దాంతో తప్పనిసరిగా ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతారు. కానీ, మధ్యప్రదేశ్‌కి చెందిన యువకుడు చేతిలో డబ్బు పెద్దగా లేకపోయినా, రాష్ట్రం కాని రాష్ట్రానికి వెళ్లి టీ వ్యాపారంతో సక్సెస్ అయ్యాడు. బంధువులు, అయినవాళ్లు, చివరికి తల్లిదండ్రులు చిన్న చూపు చూసినా వెరవకుండా తాను నమ్మిన వ్యాపారంలోకి దిగి కోట్లు సంపాదించే రేంజుకి ఎదిగాడు.

ఉత్తరాదిన ఫేమస్ అయిన ‘ఎంబీఏ చాయ్‌వాలా’ బ్రాండ్ ఓనర్ ప్రఫుల్ పటేల్ కథ ఇదీ. మొదట్లో బాగా జీతం వస్తుందని భావించి ఎంబీఏ చదవాలనుకున్నాడు. కానీ, అందులో చేరాక అర్ధమైంది. అది తన వల్ల కాదని. దాంతో కాలంతో సంబంధం లేకుండా నడిచే వ్యాపారం చేయాలని భావించి తన వద్ద ఉన్న 8 వేల రూపాయలతో గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌లో 2016లో మొదటగా టీకొట్టు పెట్టాడు. యువతను అట్రాక్ట్ చేయడం కోసం క్రికెట్ మ్యాచులు, ఆన్‌లైన్ గేమ్స్ పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. పెట్టుబడితో పాటు శ్రమ కూడా తక్కువ కావడంతో అనతికాలంలోనే తన సొంత ఊరు అయిన భోపాల్‌లో రెండో బ్రాంచ్ పెట్టాడు. ఇలా ఇప్పటివరకు 50 బ్రాంచులకు ఎదిగి ఏడాదికి సుమారు 4 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి వెళ్లాడు. ఒక్కో కేఫ్ 50 మంది కూర్చునేంత విశాలంగా నిర్మించాడు. మరో ముఖ్యమైన విషయం.. ఎంబీఏ చాయ్‌వాలా అంటే ఎంబీఏ కోర్సు అని కాదు. ఎంబీఏ అంటే ‘మిస్టర్ బిలీయనీర్ అహమ్మదాబాద్’ అని అర్ధం. ఈ పేరును బట్టి అతని ఆలోచనలు, కలలను అర్ధం చేసుకోవచ్చు.