ప్రసాద్ ల్యాబ్స్‌పై సైబర్ నేరగాళ్ల పంజా.. ఎంత దోచారంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రసాద్ ల్యాబ్స్‌పై సైబర్ నేరగాళ్ల పంజా.. ఎంత దోచారంటే.. 

July 16, 2020

Siddipet coronavirus hospital inciden..

కరోనా సంక్షోభాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటున్నవారు ఎవరంటే.. సైబర్ నేరగాళ్లే. ఫేక్ కాల్స్ చేసి ఓటీపీ నంబర్లు పంపి అకౌంట్లో డబ్బులన్నీ ఊడ్చేస్తున్న ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌పై కన్నేసి దోచేశారు. నకిలీ మెయిల్ ఐడీతో రూ.5 లక్షలకు పైగా నగదు స్వాహాచేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్ వారు, అమెరికాకు చెందిన ఓ కంపెనీ నుంచి ల్యాబ్‌కు సంబంధించి కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ మెయిల్స్ ద్వారానే జరుపుతుంటారు. 

ఈ వ్యవహారంపై నిఘా ఉంచిన సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేశారు. యూకేకు చెందిన కంపెనీ మెయిల్‌లో సమస్య ఉందనీ.. మరో మెయిల్ ఐడీ పంపిస్తే, దానికి డబ్బులు పంపాలని మెసేజ్‌లు పంపారు. అది చూసి నిజమే అనుకొని వారు పంపిన మెయిల్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ మెయిల్ ఐడీకి రూ.4 లక్షల 95 వేల నగదును ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే.. నగదు ఇంకా రాలేదని యూకే కంపెనీ వారు చెప్పడంతో వారు షాక్ అయ్యారు. మెయిల్ ఐడీ చెక్ చేసుకుని తాము మోసపోయామని గ్రహించారు. ఈ మేరకు ప్రసాద్ ల్యాబ్స్ మేనేజర్ రాజశేఖర్ హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నకిలీ మెయిల్ ఐడీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.