Prashant Kishor Admits Taking Help From 6 CMs
mictv telugu

నాకు ఆరుగురు ముఖ్యమంత్రులు డబ్బులిస్తున్నారు.. పీకే

October 27, 2022

Prashant Kishor Admits Taking Help From 6 CMs

బిహార్‌లో తాను చేపట్టిన ‘జన్‌ సురాజ్‌’ ఉద్యమానికి.. ఆర్థిక సాయం చేస్తున్నదెవరో చెప్పాలంటూ వస్తున్న ఆరోపణలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ స్పందించారు. తన మాజీ క్లయింట్లు ఆర్థికసాయం చేస్తున్నారని పీకే వెల్లడించారు. గత పదేళ్లలో తాను 11 మంది కోసం రాజకీయ సలహాదారుగా పనిచేయగా.. ఆ సేవలు పొందినవారు ఇప్పుడు అండగా ఉంటున్నారని చెప్పారు. వారిలో ఆరుగురు ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల్లో విజయం చేకూర్చేందుకు వారికి సాయం చేశానని, ఇప్పుడే వారు తిరిగి సాయం చేస్తున్నారని వెల్లడించారు. బిహార్‌లో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్‌ కిశోర్‌ నేపాల్‌ సరిహద్దుల్లోని వాల్మీకినగర్‌లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

ప్రశాంత్ కిషోర్ కు బీజేపీ డబ్బులు సమకూరుస్తూ ఉండొచ్చని జేడీయూ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌సింగ్‌ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ‘జన్‌ సురాజ్‌’ అధినేత స్వయంగా దీనిపై స్పష్టత ఇచ్చారు. రాజకీయ నాయకులు హెలికాప్టర్ల వినియోగానికి అత్యధికంగా ఖర్చు చేస్తారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అంతే కాకుండా బస్సుల్లో జనాన్ని తీసుకురావడానికి కూడా చాలా ఖర్చు అవుతుందని అన్నారు. వేదిక నిర్మాణానికి, మైదానాల బుకింగ్‌కు, ప్రకటనలకు కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ నాలుగు పనుల్లో తాము ఒక్కటి కూడా చేయడం లేదని చెప్పారు.