దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం కాంగ్రెస్ పార్టీపై ఓ రేంజులో విమర్శలు చేశారు. ఆ పార్టీకి పని చేయడం వల్ల తన ట్రాక్ రికార్డును చెడగొట్టుకున్నట్టయిందని వ్యాఖ్యానించారు. బీహార్లోని వైశాలిలో నిర్వహించిన ఓ సభలో ఆయన ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘2011 నుంచి 2021 వరకు నేను పదకొండు ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు పనిచేశాను.
కానీ, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పనిచేసి మొదటిసారి ఓడిపోయాను. దాని వల్ల నా పేరు నేనే చెడగొట్టుకున్నట్టయింది. భవిష్యత్తులో ఆ పార్టీతో పనిచేయను. తనని తాను అభివృద్ధి చేసుకోని పార్టీ అది. అది మునుగుతూ.. దాంతో పొత్తు పెట్టుకున్న పార్టీలను కూడా ముంచేస్తుంది. చింతన్ శివిర్ వల్ల పెద్ద ప్రయోజనం కలుగద’ని ఘాటుగా విమర్శించారు. అలాగే.. 2021లో పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వంద సీట్లు సాధిస్తామని చెప్పింది. కానీ, తృణమూల్ పార్టీ 55 సీట్లకే పరిమితం చేసిందని తెలిపారు. కాగా, కొద్దిరోజుల కింద కాంగ్రెస్లో చేరాలనుకున్న ప్రశాంత్ కిషోర్.. ఆ పార్టీ వైఖరితో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.