వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇక గెలువలేనన్న భయంతోనే కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించాడని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ వ్యుహాలు, సర్వేలు పని చేయవని తెలిపారు. కేసీఆర్ వద్ద పీకే స్వచ్చందంగా పని చేయడం లేదని, రూ. 600 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ను ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు.
ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల ప్రజా సంక్షేమ పాలనపై బుధవారం మెదక్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో ఈటెల మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ఎనిమిదేండ్ల మోడీ పాలనలో ఎక్కడనైనా కుంభకోణాలు జరిగాయా? అని అడిగారు. కరోనా కష్టకాలంలో దేశాన్ని కాపాడిన వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు.
కేసీఆర్ అంటే ప్రజలకు అసహ్యం వేస్తుందన్నారు ఈటెల. రైతులకు ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని మోసం చేశాడని చెప్పారు. తెలంగాణలో ఉన్న ఒక్కో వ్యక్తిపై రూ 1.25 లక్షల అప్పు ఉందని.. కాదని నిరూపిస్తే చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగి పోతుంటే, మరోవైపు పన్నులు పెంచుతున్నాడన్నారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన గౌరవేల్లి రైతులపై లాఠీచార్జి చేయించారని మండిపడ్డారు.