‘జగన్, నితీశ్‌లకు సాయం చేసే బదులు.. ఆ పని చేసి ఉంటే బాగుండేది’ - MicTv.in - Telugu News
mictv telugu

‘జగన్, నితీశ్‌లకు సాయం చేసే బదులు.. ఆ పని చేసి ఉంటే బాగుండేది’

October 31, 2022

రాజకీయ వ్యూహకర్త, జనసురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ల పదవీ కాంక్షకు (ముఖ్యమంత్రులు అయ్యేందుకు) తాను సాయపడ్డానని, ఆ పని చేయకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వారి పదవీ కాంక్షకు సాయ పడడం కన్నా కాంగ్రెస్ పునరుజ్జీవానికి కృషి చేసి ఉంటే బాగుండేదని అన్నారు. గాడ్సే సిద్ధాంతాన్ని ఎదుర్కోవాలంటే అదొక్కటే మార్గమని చెప్పుకొచ్చారు. గాంధీ కాంగ్రెస్‌ పునరుజ్జీవంతోనే ఓడించగలమని తెలుసుకోవడానికి తనకు చాలాకాలం పట్టిందన్నారు. ప్రస్తుతం బీహార్ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిశోర్ 2014 ఎన్నికల సమయం నుంచి తాన రాజకీయ వ్యూహకర్తగా అందించిన సేవలు..గుర్తించిన అంశాల పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపుతున్నాయి.

ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయ యాత్రను అడ్డుకోవటంలో విపక్షాల కూటమి(కాంగ్రెస్‌ను ఉద్ధేశించి) సమర్ధతపైన ప్రశాంత్ కిషోర్ సందేహాలు వ్యక్తం చేసారు. బీజేపీ అసలు ఏంటనేది అర్దం చేసుకోకుండా, ఆ పార్టీని ఓడించలేరని విశ్లేషించారు. ఓ కాఫీ కప్పులో పైన ఉండే నురుగు బీజేపీ అయితే, అసలు కాపీ ఆరెస్సెస్ అని..అది సమాజంలోకి చొచ్చుకెళ్లిందని పీకే చెప్పుకొచ్చారు. దానిని ఓడించటానికి దగ్గర దారులు ఏమీ లేవని అభిప్రాయపడ్డారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రచార నిర్వహణను విజయవంతంగా చేపట్టి పీకే తొలిసారి వెలుగులోకి వచ్చారు. అయితే ఆయన ప్రధాని అయ్యాక సంబంధాలు తెంచుకుని బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌తో చేతులు కలిపారు. జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ పార్టీలతో మహాకూటమి ఏర్పాటు చేసి విజయపథంలో నడిపారు. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో ఏపీలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా సేవలు అందించారు. వైసీపీ ప్లీనరీకి హాజరయ్యారు.