Prashant refuses to marry Priya in Coimbatore
mictv telugu

మోసపోయానని ఆచారం ప్రకారం నగ్నంగా ఉరేసుకున్న యువతి

November 19, 2022

ప్రేమ పేరుతో రెండేళ్లు వాడుకొని ప్రియుడు మోసం చేశాడని యువతి కుంగిపోయింది. కుల ఆచారం ప్రకారం నగ్నంగా ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా సంచలనమైన ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. నమ్మక్కళ్ జిల్లాకు చెందిన ప్రియా (26) అనే యువతి బాగా చదువుకొని చెన్నైలో ఉద్యోగం చేయాలని ఆశపడేది. అయితే కోయంబత్తూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో మంచి జీతంతో ల్యాబ్ టెక్నీషియన్‌‌గా ఉద్యోగం రావడంతో అక్కడే హాస్టల్‌‌లో ఉంటూ విధులకు హాజరయ్యేది. ఈ క్రమంలో అదే ప్రాంతంలో సూపర్ వైజర్‌‌గా పనిచేస్తున్న ప్రశాంత్ (25) అనే కుర్రాడు పరిచయమై అది ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ కలిసిమెలిసి తిరిగారు. ప్రియుడు ప్రియ రూంకి స్వేచ్ఛగా వెళ్లి వస్తుండేవాడు. రెండేళ్లు గడిచిన తర్వాత పెళ్లి చేసుకుందామని కోరడంతో ప్రశాంత్ నిరాకరించాడు. ఇలాగే ఉండి ఎంజాయ్ చేద్దామన్నాడు. ప్రియుడిలో కొంతైనా మార్పు వస్తుందేమోనని ఆశపడ్డ ప్రియకి చివరకి నిరాశే ఎదురైంది. ఓ రోజు గట్టిగా నిలదీసేసరికి నీవు ఆదివాసీ యువతివని, తక్కువ కులం కాబట్టి పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పేశాడు. దీంతో యువతి సూసైడ్ నోట్ రాసి తన రూంలోనే నగ్నంగా ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు విచారించగా, ఆదివాసీల్లో చనిపోయిన వారిని నగ్నంగా పాతిపెట్టడం అలవాటని తేలింది. ప్రియుడు మోసం చేశాడని బాధలో ఉన్న ప్రియ.. చివరికి చనిపోయేటప్పుడు కూడా కుల ఆచారం పాటించిందని పోలీసులు తెలిపారు. ప్రియా ఆత్మహత్యకు కారణమైన ప్రశాంత్‌‌ను అరెస్ట్ చేశామని, విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.