ప్రశాంత్ కిశోర్ మంత్రం తుస్సు.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రశాంత్ కిశోర్ మంత్రం తుస్సు..

August 28, 2017

ఎన్నికల్లో ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులువు కాదు. ఇందిర గాంధీ వంటి రాజకీయ దిగ్గజాలనే అనూహ్య తీర్పులతో ఇళ్లకు పంపిన ఘనత ఓటర్లది. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ అంచనాలు ఘోరంగా తప్పాయి. క్షేత్రస్థాయి పరిస్థితులంపై అంచనా లేకపోవడం, ప్రత్యర్థికి కలసి వచ్చే అంశాలపై అవగాహన లేకపోవడం, జగన్ దూకుడు వ్యాఖ్యలు అన్నీ కలసి వైఎస్సార్ సీపీకి చుక్కలు చూపాయి.

వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి విజయం కోసం ప్రశాంత్ కిశోర్ బాగానే పావులు కదిపారు. సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేసి ప్రచారం చేయించారు. జగన్ కు ప్రసంగాల విషయంలో సాయం చేశారు. ఒక దశలో.. జగన్ ఏం మాట్లాడాలో కూడా కిశోరే చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలు 2019 ఎన్నికల్లో ఆయన భవిష్యత్తేమిటో సూచిస్తాయని పరిశీలకులు భావించారు. దీంతో కిశోర్ పై ఒత్తిడి పెరిగింది. కేవలం ప్రచారం మాత్రమే సరిపోదని, ప్రత్యర్థుల బలాన్నీ ఢీకొనే వ్యూహాలు కూడా కావాని నంద్యాల ఫలితాలు జగన్ పార్టీకి గుణపాఠం నేర్పాయి.

2014లో మోదీ విజయానికి వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిశోర్ కు డిమాండ్ బాగానే ఉంది. బిహార్ ఎన్నికల్లో నితీశ్ ను, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అమరీందర్ ను గెలిపించిన సత్తా ఆయనది. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో కిశోర్ అంచనాలు తారుమారవుతూ వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనతో వ్యూహాలు వేయించుకున్న కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. దీన్ని ఒక ఎన్నికలో అంచనాలు తప్పడం పెద్ద విషయం కాదు. కానీ ఉత్తరాది వాడైన కిశోర్ కు నంద్యాల రాజకీయ సమీకరణాలు సరిగ్గా అర్థం కాలేదు. రాయసీమలో ఓటర్లు పార్టీలకు కాకుండా వ్యక్తులకే ప్రాధ్యాన్యమిస్తారన్న విషయాన్ని ఆయన పట్టించుకోలేదు. పైగా మొన్నటివరకు టీడీపీలో ఉండి తాజాగా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వెనుక కిశోర్ హస్తం ఉందని వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే ఈ విషయంలో కిశోర్ ది పెద్ద తప్పే అవుతుంది. భూమా కుటుంబంవైపు వీస్తున్న సానుభూతి పవనాల బలాన్నికూడా కిశోర్ తక్కువగానే అంచనా వేశారు. మొత్తానికి ప్రచారంపైనే కాకుండా అభ్యర్థి ఎంపిక, ఓర్పు.. తదితర విషయాల్లోనూ పటిష్టమైన వ్యూహం ఉంటేనే గెలిచే అవకాశాలు ఉంటాయని ఈ ఎన్నికలు చెబుతున్నాయి.

నంద్యాల అర్బన్, నంద్యాల రూరల్, గోస్పాడు సెగ్మెంగ్లటలో జగన్ పార్టీకి వస్తాయని కిశోర్ వేసిన అంచనాలు ఘోరంగా తప్పాయి. అర్బన్ లో టీడీపీ, రూరల్, గోప్పాడులో వైఎస్సార్ సీపీ మెజారిటీ వస్తుందన్నది ఆయన అంచనా. అయితే ఈ మూడు చోట్లా ప్రజా తీర్పు టీడీపీకే సానుకూలంగా వచ్చింది.