వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఆత్మహత్య యత్నం ఘటనకు సంబంధించి డీఎంఈ రమేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వివాదస్పదంగా మారాయి. తమ కాలేజీలో ఎటువంటి ర్యాగింగ్ జరగలేదని, విద్యార్థిని, సీనియర్ మధ్య ఉన్నవి మనస్పర్థలు మాత్రమేనని రమేశ్‌రెడ్డి చెప్పడంపై ప్రీతి తండ్రి నరేందర్ మండిపడ్డారు. ప్రీతిపై ర్యాగింగ్ జరగలేదని డీఎంఈ చెప్పడం సరికాదని అన్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ర్యాగింగ్ వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని అన్నారు.
ర్యాగింగ్ జరుగుతుందని తన కూతురు చెప్పిందని.. దీనిపై సంబంధిత పోలీసు స్టేషన్‌కు కూడా తాను సమాచారం ఇచ్చానని చెప్పారు. అందుకు సంబంధించిన మెసేజ్‌లు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే ప్రీతి స్పృహా కోల్పోయినప్పుడు ఆమె ఫోన్ నుంచే తనకు కాల్ చేశారని.. అయితే ఫోన్ లాక్ ఎలా ఓపెన్ చేశారని ప్రశ్నించారు. స్పెషల్ కేర్ తీసుకుని ప్రీతిని బతికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా వైద్యులు చెబుతున్నారని తెలిపారు.
గురువారం నిమ్స్‌కు వెళ్లిన రమేశ్ రెడ్డి.. ప్రీతికి కొనసాగుతున్న చికిత్సపై ఆరా తీశారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆత్మహత్య ఘటనపై ఇప్పటికే నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని నియమించామని.. ఆ కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.