వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి సూసైడ్ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. ప్రీతి బాడీలో ఎలాంటి టాక్సిన్స్ (విషవాయువులు) లేవంటూ ఫోరెన్సిక్ బృందం తన రిపోర్టులో పేర్కొంది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ వెల్లడించింది. అయితే.. దీంతో ప్రీతి ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిందంటూ ముందుగా చెబుతూ వచ్చిందంతా అబద్ధమని ఫొరెన్సిక్ రిపోర్టుతో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో.. ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్య అంటూ వాదిస్తూ వస్తున్నవారి మాటే నిజమైందనే విషయం తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన తాజా నివేదికతో ప్రీతిది హత్యేననే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించనున్నట్లు సమాచారం.
ఇక టాక్సికాలజీ రిపోర్టుపై ప్రీతి సోదరుడు పృధ్వీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. ‘ప్రీతికి నిమ్స్‌లో బ్లడ్ డయాలసిస్ చేసి, ప్లాజ్మా కూడా చేశారు. ప్రీతిని ఆస్పత్రిలో సాయంత్రం 4గంటలకు చేర్పిస్తే.. ఆ రోజు రాత్రి 2 గంటలకు సర్జరీ చేశారు. తన కడుపులో నుంచి కాటన్ తో క్లీన్ చేయడం చూశాను. బ్లడ్ ఎక్కించిన తర్వాత, ప్లేట్ లెట్స్ ఎక్కించిన తర్వాత.. ఎక్మో పెట్టిన తర్వాత బ్లడ్ సాంపిల్స్ తీసుకున్నారు. దీని వల్లే రిపోర్టులో విష పదార్ధాలు ఏమీ లేదని వచ్చింది. శరీరం మొత్తం క్లీన్ చేసి రిపోర్టు తీస్తే ఏం ఉంటుంది. గవర్నర్ రాక ముందే డయాలసిస్ చేశారు. మాకు తెలియని విషయాలు కూడా పోలీసులు మాకు చెప్పారు. ప్రీతి కళ్లకు టేప్ ఎందుకు వేశారు. ఆ నాలుగు గంటల పాటు ఏమైందో మాకు ఎందుకు చెప్పడం లేదు. మాకు ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి’ అని కామెంట్స్ చేశారు.
పోలీసులపై తమకు చాలా నమ్మకముందని చెప్పిన పృథ్వీ.. కానీ ప్రీతి ఫోన్ నుంచి లాస్ట్ కాల్ ఉ.3గంటలకు వెళ్లిందని, తన తండ్రికి రా.8గంటలకు వచ్చిందని.. ఈ మధ్య గ్యాప్ లో ఏం జరిగిందన్న విషయం మాత్రం తమకు చెప్పట్లేదని వాపోయారు. తన తండ్రి రాత్రి ప్రీతిని కలిసినపుడు చాలా ఫిట్ గా ఉందని, అలాంటి ఆమె మార్నింగ్ సరికల్లా ఇలా మారిందని పృద్వీ ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే డీజీపీ వరంగల్ సీపీ రంగనాథ్‌కు ఫోన్ కూడా చేశారు.