బుద్ధుడి చెంత భారీ పూలే విగ్రహం.. స్థల పరిశీలన - MicTv.in - Telugu News
mictv telugu

బుద్ధుడి చెంత భారీ పూలే విగ్రహం.. స్థల పరిశీలన

February 28, 2020

Mahatma Jyotiba Phule.

వెనుకబడిన తరగతుల, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేసిన మహాత్మా జ్యోతిబాపూలె భారీ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పూలే భారీ విగ్రహాన్ని బుద్దపూర్ణి ప్రాజెక్ట్‌ పరిధిలోనే హుస్సేన్‌సాగర్‌ వద్ద ఏర్పాటు చేసేందుకు స్ధలం కోసం పరిశీలన జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ శుక్రవారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. టాంక్‌బండ్‌, సెక్రటేరియట్‌ సర్కిల్‌, నెక్లెస్‌రోడ్డు కూడళ్లలో స్థలం కోసం పరిశీలన చేశారు.  

ఈసందర్భంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ..  ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీసీ పక్షపాతి. ఆయన, మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు స్థల పరిశీలన చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంతగా తెలంగాణ ప్రభుత్వం జ్యోతిబాపూలేకు సముచిత గౌరవం ఇస్తోంది. ఇప్పటికే పూలే పేరుతో వందల గురుకులాలను ప్రభుత్వం స్థాపించింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాలకు ఆధునిక, ఉన్నత విద్యను కల్పిస్తున్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. నెక్లెస్‌రోడ్‌ వద్ద 2వేల గజాల స్థలాన్ని ప్రాథమికంగా ఎంపిక చేసి మంత్రి కేటీఆర్‌కు నివేదిక అందజేస్తాం’ అని మంత్రి తెలిపారు. అనంతరం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ‘పూలే విగ్రహాన్ని నగరంలోని హుస్సేన్‌సాగర్‌, సెక్రటేరియట్‌ సమీపంలో నెలకొల్పడం వల్ల బీసీల విద్య అభివృద్దికి కృషి చేసినవారిని స్మరించుకుని, స్పూర్తి పొందేందుకు అవకాశం ఉంటుంది’ అని అన్నారు.