President Appoints Justice DY Chandrachud As Next Chief Justice
mictv telugu

44 ఏళ్ల తర్వాత సీజేఐగా తండ్రి స్థానంలో కొడుకు

November 9, 2022

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనుంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ (DY Chandrachud) ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో… రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప-రాష్ట్రపతి, ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. దేశ అత్యున్నత న్యాయ పీఠాన్ని తండ్రీకొడుకులు అధిరోహించడం ఇదే మొదటిసారి. 44 ఏళ్ల కిందట జస్టిస్ చంద్రచూడ్ తండ్రి జస్టిస్ జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఫిబ్రవరి 22, 1978 నుంచి జులై 11, 1985 వరకు ఏడు సంవత్సరాల ఐదు నెలలు పాటు చీఫ్ జస్టిస్‌గా కొనసాగారు. సుదీర్ఘకాలం సీజేఐగా కొనసాగిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆయన తనయుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తున్నారు. జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

రాజ్యాంగంలో భిన్న అంశాలకు జస్టిస్ చంద్రచూడ్ చెబుతున్న వివరణలు, చేస్తున్న వ్యాఖ్యలు కేవలం న్యాయ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో చర్చలకు కారణం అయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఈయన పేరు ట్రెండ్ కూడా అయింది. వ్యక్తిగత గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుల్లో భాగంగా పేర్కొంటూ 2017లో సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. వారిలో జస్టిస్ చంద్రచూడ్ కూడా ఒకరు.

అమెరికాలో లా, బ్యాచ్ టాపర్…

1959 నవంబరు 11న బాంబేలో జన్మించిన జస్టిస్‌ చంద్రచూడ్‌.. ఢిల్లీ సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఎకనమిక్స్‌లో బీఏ, ఢిల్లీ వర్సిటీ క్యాంపస్‌ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. అనంతరం 1983లో అమెరికాలోని హార్వర్డ్‌ లా స్కూల్‌లో స్కాలర్‌షిప్‌ మీద ఎల్‌ఎల్‌ఎం డిగ్రీలో చేరి.. ఆ బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచి జోసెఫ్‌ హెచ్‌.బీలె బహుమతి అందుకున్నారు. అదే యూనివర్సిటీ నుంచి జ్యుడిషియల్‌సైన్సెస్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశారు.

ముంబయి యూనివర్సిటీ, అమెరికాలోని ఒక్లహామా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లాలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌‌గానూ కొన్నాళ్ళు పనిచేశారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత మహారాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 1998 నుంచి అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేశారు.

బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా 2000 మార్చి 29న బాధ్యతలు చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్… 2013 అక్టోబరు 31న అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. 2016 మే 13న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన 734 తీర్పుల్లో భాగస్వాములయ్యారు. అందులో 520 వరకూ ఆయన సొంతంగా రాశారు. జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు ఈ-కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే కోర్టు విచారణలను ప్రత్యక్షప్రసారం చేసే మౌలికవసతులను కల్పించారు.

న్యాయవాదిగా ఉన్నప్పటి నుంచి సామాజిక అంశాలపై సూక్ష్మదృష్టిసారించిన వ్యక్తిగా మంచి పేరు సంపాదించారు. హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ సోకిన కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఓ కార్మికుడి తరఫున 1997లో వాదించి అతడికి న్యాయం జరిగేలా చూశారు. వెట్టిచాకిరిలో కూరుకుపోయిన మహిళలు, మత, భాషాపరమైన అల్పసంఖ్యాకుల హక్కుల కోసం న్యాయస్థానాల్లో బాధితుల పక్షాన నిలిచారు.