తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితం.. రాష్ట్రపతి - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితం.. రాష్ట్రపతి

December 4, 2022

President Draupadi Murmu praised Telugu language and literature

తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. పోరంకిలో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతిని గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సన్మానించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పదనం దేశం మొత్తానికీ తెలుసని చెప్పారు.

దేశ భాషలందు తెలుగు లెస్స అని ముర్ము కొనియాడారు. దేశంలోని అన్ని భాషల్లో తెలుగు శ్రేష్టమైనదని చెప్పారు. కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రనను సర్మించుకున్నారు. మొల్ల, దుర్గాభాయ్‌, సరోజినీ నాయుడు వంటి మహనీయుల గొప్పదనాన్ని కీర్తించారు. మొల్ల రామాయణం పేరుతో మహాకావ్యం రచించారని, దానికి భారతీయ సాహిత్యంలో అగ్రస్థానం దక్కిందని వెల్లడించారు. గురజాయ రచించిన కన్యాశుల్కం నాటకం ప్రజల మన్ననలు పొందిందని చెప్పారు. దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ స్వాతంత్య్ర సంగ్రామంలో తనవంతు పాత్ర పోషించారని తెలిపారు. ఆంధ్ర మహిళా సభను స్థాపించారన్నారు. సరోజినీ నాయుడు ఉప్పు సత్యాగ్రహంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు.

వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్ర స్థలానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా వంటి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయన్నారు. ఆంధ్రా ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతిని గౌరవించుకోవడం కోసం ప్రజలందరి తరఫున ద్రౌపది ముర్ముకు పౌర సన్మానం చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పారు. కష్టాలను ఎదుర్కొంటూ దేశ అత్యున్నత స్థానానికి ఎదిగిన ద్రౌపది ముర్ము జీవితం అందరికీ ఆదర్శప్రాయమని సీఎం జగన్ పేర్కొన్నారు.