మరికాసేపట్లో భద్రాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాద్రి, రామప్ప ఆలయాలను సందర్శించనున్నారు. మొదట భద్రాద్రి శ్రీసీతారామ చంద్రస్వామిని, ఆ తర్వాత రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో భద్రాచలంలో బుధవారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. భద్రతా కారణాలతో భద్రాచలం రామవారధిపై ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాకపోకలు నిషేధించారు. భద్రాచలం, సారపాకల్లో 144 సెక్షన్ విధించి స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
రాష్ట్రపతి పర్యటన ఇలా..
ఈ ఉదయం హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌బేస్ నుంచి ప్రయాణమైన రాష్ట్రపతి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. అక్కడ నుంచి 9:50 గంటలకు భద్రాచలం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 10:15 నుంచి 10:30 వరకు భద్రాచలం రామాలయంలో రాములోరి దర్శనం చేసుకుని ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ జంజతి సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం బైపాస్ రోడ్‌లో వీరభద్రకళ్యాణ మండపం వద్ద జరిగే వర్చువల్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11:40 గంటలకి తిరిగి ఐటీసీ గెస్ట్‌హౌస్‌కి చేరుకుంటారు. 13:35 గంటలకు తిరిగి ములుగు జిల్లా రామప్ప టెంపుల్‌కు వెళ్లనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై కూడా రాష్ట్రపతితో పాటు రానున్నారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.