భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల ద్వారా భారతదేశ 16వ రాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జూన్ 30 నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జులై 2. ఇక రాష్ట్రపతి ఎన్నికకు జులై 18న పోలింగ్ నిర్వహించి, 21న ఫలితాలను విడుదల చేయనున్నారు. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24న ముగియనుంది.
ఈసారి ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇంతవరకు అధికారపక్షం కానీ, విపక్షాలు కానీ తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో, సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. ముఖ్యంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అస్సాం గవర్నర్ జగ్దీష్ ముఖి, ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయ యూకీ లో ఒకరిని బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కూడా రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్, కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. బీహార్‌లో అధికారాన్ని బీజేపీ తీసుకొచ్చేందుకు వీలుగా.. అక్కడి సీఎంను గౌరవప్రదంగా తప్పించేందుకు.. రాష్ట్రపతి పదవిని ఇవ్వచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఈసారి ఆదివాసీలు లేదా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆదీవాసీలకు ఇవ్వాలనుకుంటే మాత్రం.. ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయ యూకీలో ఒకరిని ఎంపిక చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో ద్రౌపది ముర్ము పేరే ప్రధానంగా వినిపించింది. కానీ అనూహ్యంగా రామ్‌నాథ్ కోవింద్‌ను బరిలోకి దించింది ఎన్డీయే.