దళిత్ వర్సెస్ దళిత్…అంతకు మించిన అర్హతలు…ఎవరికి వారే సాటి…దళిత్ అభ్యర్థి బీహార్ మాజీ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ తో విపక్షాల్ని ఎన్డీయే సందిగ్ధం పడేస్తే…. కాంగ్రెస్ అండ్ కో అదే స్థాయిలో దీటైన సమాధానం ఇచ్చాయి. లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ను రేసులోకి తెచ్చాయి. దళిత్ వర్సెస్ దళిత్ లో గెలుపెవరిది..? ఎత్తుకు పైఎత్తుల్లో పై చేయి ఎవరిది..? వార్ వన్ సైడా… లాస్ట్ వరకు ఆమె సైడా…?
జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. జూలై 20న ఓట్లు లెక్కిస్తారు. 14వ రాష్ట్రపతి ఎన్నిక రేసులో అధికార, విపక్షాలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ వేశారు. విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పోటీపడుతున్నారు. రామ్‌నాథ్ నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేయగా, వాటిపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, పంజాబ్ మాజీ ప్రకాశ్ సింగ్ బాదల్ సంతకాలు చేశారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి దగ్గర 48.6 శాతం ఓట్లు ఉన్నాయి. టీఆర్ఎస్, అన్నాడీఎంకే, బీజేడీ, జేడీ లాంటి ప్రాంతీయ పార్టీలు కూడా రామ్‌నాథ్‌కు ముందే మద్దతు ప్రకటించాయి.
విపక్ష అభ్యర్థి మీరా కుమార్ ఈ నెల 27 లేదా 28న నామినేషన్ దాఖలు చేస్తారు. మీరా కుమార్‌కు 17 పార్టీల మద్దతు ఉంది. సైద్ధాంతికంగానే మీరా కుమార్ పోటీ చేస్తున్నారని విపక్షాలు చెబుతున్నాయి. పాట్నాకు చెందిన మీరా కుమార్.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కుమార్తె. 1970లో ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో చేరి మీరా కుమార్ దౌత్యవేత్తగా పనిచేశారు.1985లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయిదుసార్లు ఎంపీగా సేవలందించారు. ఆమె మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికై రికార్డ్ సృష్టించారు.
బీహార్ గవర్నర్‌గా పని చేసిన కోవింద్, బీహార్ రాష్ట్రానికే చెందిన మీరాకుమార్‌ల మధ్య గట్టి పోటీ ఉంది. దళితుడు, మేధావి, అప్పట్లో ఇందిరిగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారని, దళితుల కోసం ఎంతో సేవ చేశారనే బీజేపీ రామ్ నాథ్ ను రాష్ట్రపతి రేసులోకి దించింది. బీఎస్పీ లాంటి పలు పార్టీలు తొలుత మద్దతు పలికాయి. అయితే అదే దళిత్ అస్త్రంతో కాంగ్రెస్ దిమ్మతిరిగే పోయే షాక్ ఇచ్చింది. దీంతో బీఎస్పీతో సహా పలు పార్టీలు మనస్సు మార్చుకుని మీరాకుమార్ వైపు మళ్లాయి. కాంగ్రెస్‌తో పాటు ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌పార్టీ, ఆర్‌ఎస్పీ, జేడీఎస్, జార్ఖండ్ ముక్తిమోర్చా తదితర పార్టీలు మీరాకుమార్‌కు మద్దతు తెలిపాయి. తటస్థ పార్టీలన్నీ మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా నిలిచాయి.
మీరా కుమార్ ప్లస్ పాయింట్స్
కోవింద్‌తో పోల్చుకుంటే మీరాకుమార్ సమర్థురాలు. మీరాకుమార్ లో ఎన్నో విశిష్టతలున్నాయి. దళిత మహిళ అనే కోణం, దళితనేత జగ్జీవన్‌రాం పుత్రిక కావడం ప్లస్ పాయింట్స్. ఐదుసార్లు లోక్ సభకు ఎన్నిక, రెండుసార్లు కేంద్రమంత్రి,ప్రథమ మహిళ స్పీకర్ గా రికార్డ్ కలిసివచ్చే అంశాలు. బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటం…. తానూ స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటం…. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు దళిత వర్గాల్లో మీరాకుమార్ కు గుర్తింపు ఉండటం… పార్టీలకు అంతీతంగా ఆమెకు దళిత నాయకుల్లో మద్దతు ఉండటం ప్లస్ పాయింట్. ఇక ఎస్సీ, ఎస్టీలకు సేవల విషయంలో రామ్ నాథ్ చేసిన దాని కంటే కొన్నిఏళ్ల ముందే బిహార్ ను కరువు మేఘాలు కమ్మకున్నప్పుడు అశేషజనం మద్దతుతో అన్న పానీయాలు అందించిన నేత జగ్జీవన్ రాం. మీరా కుమార్ ఆయన బిడ్డ కాబట్టి అన్ని పార్టీలూ ఆమె వైపే ఉంటాయి.
లెక్కలు ఇవీ…
ఇప్పడైతే ఏకపక్ష పోటీగా భావిస్తున్న ఈ ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిదే పై చేయిలా ఉంది. రామ్‌నాథ్‌కు సుమారు 61 శాతం ఓట్లు పడే అవకాశాలున్నాయి. బీజేపీ మిత్రపక్షాలతో పాటు నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, ఏఐఏడీఎంకేలోని పళనిస్వామి.. పన్నీర్ సెల్వం వర్గాలు సైతం కోవింద్‌కు మద్దతు తెలిపాయి.మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీల ఓట్ల విలువ 10,98,903గా ఉంది. ఎన్నికల్లో నెగ్గాలంటే అభ్యర్థికి కనీసం సగమైనా అంటే – 5,49,442 పాయింట్లు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోవింద్‌కు ఇప్పటికే 62.8 శాతం అంటే దాదాపు 6,90,111 ఎలక్ట్రోరల్ పాయింట్ల బలం ఉంది.
అటు మొత్తం 17 ప్రతిపక్ష పార్టీల నుంచి మీరాకుమార్‌కు 33.7 శాతం మద్దతు ఉంది. ఓటింగ్ పాయింట్లలో చెప్పాలంటే ఆమెకు ప్రస్తుతమున్న ఓట్ల విలువ 3,70,330 పాయింట్లు మాత్రమే. ఇక ఇతర పక్షాల జాబితాలో ఉన్న ఓట్ల విలువ చూస్తే ఆమాద్మీకి 0.8 శాతం, స్వతంత్రులు, చిన్నపార్టీలు కలిపి 2.7 శాతం ఓట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
దళిత అభ్యర్థే కాదు మహిళను తెరపైకి విపక్షాలు తెచ్చాయి.దళిత మహిళా తొలి సారి రాష్ట్రపతి పదవి అయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇదే అన్ని పార్టీల్ని ఆలోచించేలా చేస్తుంది. మీరా కుమార్ కే ఓటేయాలో..నమో మంత్రాన్నే వినిపించాలో అనే సందిగ్ధంలో పడ్డాయి. ఎన్డీయేకి షాక్ ఇస్తూ గట్టి అభ్యర్థిని ఎంపిక చేసినట్టే కాంగ్రెస్ 17 పార్టీలతో మద్దతుతో పాటు తటస్థ పార్టీల మద్దుతు కూడే ప్రయత్నం చేస్తే ఫలితం మరోలా ఉండొచ్చు. బీజేపీ అంచనాలు తలకిందులు అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి రాష్ట్రపతి రేసు ఈ సారి యమ రసపట్టులో సాగబోతోంది.