అమ్మ ఆశీర్వాదం కోసం.. రాష్ట్రపతి తలవంచి.. - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మ ఆశీర్వాదం కోసం.. రాష్ట్రపతి తలవంచి..

March 17, 2019

అమ్మ ప్రేమను మించింది మరొకటి లేదంటారు. నిజమే.. అమ్మ దీవెనల కోసం గవర్నమెంట్ నిబంధనలు కూడా తలవంచాయి. రాష్ట్రపతి భవన్‌లో నిన్న జరిగిన పద్మ పురస్కార ప్రదానోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత ప్రథమ పౌరుడికి శతాదిక వృద్ధురాలు ఆశీర్వాదాలు అందించింది. ప్రధాని మోదీతో పాటు అనేక మంది ప్రముఖులు ఈ దృశ్యాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు.

President Kovind Gives Away Padma Awards Goes Back With Blessings .

వృక్షమాతగా పేరుగాంచిన కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్కకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ‘పద్మ’ అవార్డు ప్రదానం చేశారు. ఆ సమయంలో కెమెరావైపు చూడమని తిమ్మక్కను కోవింద్ కోరారు. వెంటనే తిమ్మక్క ఆయన తలపై చేయి వేశారు. దీనికి ప్రతిస్పందించిన కోవింద్.. తిమ్మక్కవైపు తన తల వంచి ఆశీర్వాదం తీసుకున్నారు. పటిష్ఠ ప్రొటోకాల్ నిబంధనల మధ్య సాగిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి తిమ్మక్క లేత ఆకుపచ్చ చీరె ధరించి, చిరునవ్వుతో విచ్చేశారు. ఈ సందర్భంగా ఆ శతాధిక వృద్ధురాలు ఎంతో ఆప్యాయంగా కోవింద్ నుదుటిని స్పృశించి ఆశీర్వదించడంతో రాష్ట్రపతితోపాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని నరేంద్రమోదీ, ఇతర అతిథులందరి ముఖాల్లో నవ్వులు విరబూశాయి.

కర్ణాటకలో వేలాది మొక్కలను నాటడమే కాక వాటిని కన్న బిడ్డల్లా పెంచి పోషించింది తిమ్మక్క. ఇప్పటి వరకు ఆమె సుమారు 8,000 మొక్కలను నాటి ఎంతో మందికి నీడనందించారు. అందులో 400 మర్రి మొక్కలు ఉన్నాయి. ఇప్పటికి అందులో ఎన్నో చెట్లు మహావృక్షాలుగా ఎదిగాయి. వాస్తవానికి తిమ్మక్కకు పిల్లలు లేకపోవడంతో మొక్కలు నాటడం ప్రారంభించారు. మొక్కల్లోనే పిల్లలను చూసుకుని ఆనందపడుతుందని ఆమెను ఎరిగిన వారు చెబుతున్నారు.