రాష్ట్రపతి సహృదయం.. బిరబిరా వచ్చి, ఎలా ఉందమ్మా అని - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతి సహృదయం.. బిరబిరా వచ్చి, ఎలా ఉందమ్మా అని

October 29, 2019

President Kovind, Nirmala Sitharaman attend

ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు అలాంటివారి పట్లే దయ కలిగిఉంటే వాళ్లు ఉన్నతులు ఎప్పటికీ కాలేరు. తమకన్నా స్థాయి తక్కువ ఉన్నవారి పట్ల దయకలిగి ప్రవర్తించినప్పుడే వారిని ఉన్నతులు అనవచ్చు. ఇలాంటివారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మరోమారు నిరూపించుకున్నారు. ఆ స్థాయివాళ్లు ప్రొటోకాల్ లేకుండా కాలు కూడా బయటకు పెట్టరు. ఆఖరికి ఎవరైనా ఆపదలో ఉన్నా కాపాడాలని అనిపించినా రక్షణ మధ్యే వారు ఆ సహాయక చర్యకు పూనుకుంటారు. కానీ రాష్ట్రపతి కోవింద్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా వెళ్లారు. 

మంగళవారం రాష్ట్రపతి ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మంగళవారం మొదటి జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. వారంతా కలిసి వేదికపై నిలబడి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. అదే సమయంలో వేదిక ముందు మొదటి వరుసలో నిల్చున్న ఓ మహిళా పోలీసు అధికారి కాలి మడమ మెలికపడి కుప్పకూలి పడిపోయారు. 

అది గమనించారు రష్ట్రపతి. వెంటనే వెళ్లాలనుకున్నారు. కానీ, జాతీయ గీతాన్ని అవమానించినట్టు అవుతుందని భావించి, జాతీయ గీతం ఆలపించడం పూర్తి అయ్యాక అక్కడికి వెళ్లారు. అక్కడే ఉన్న మంత్రి సీతారామన్‌, అనురాగ్ ఠాకూర్‌తో మాట్లాడి, వేదిక నుంచి దిగి, కుప్పకూలిన మహిళా పోలీసు అధికారిణి వద్దకు వెళ్లి పరామర్శించారు. ఆమెకు ప్రమాదమేమి లేదని నిర్థారించుకున్న తర్వాత వారంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. రాష్ట్రపతి మంచి మనసు మీద నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రోటోకాల్‌ని పక్కన పెట్టి ఓ పోలీసు అధికారిని పరామర్శించిన ఆయనను అందరూ తమ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.