రాష్ట్రపతి ఎన్నిక.. అభ్యర్ధిగా ఎవరున్నా వైసీపీ డిమాండ్లు ఇవీ - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతి ఎన్నిక.. అభ్యర్ధిగా ఎవరున్నా వైసీపీ డిమాండ్లు ఇవీ

May 9, 2022

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 25తో ముగియనుంది. దాంతో తర్వాతి రాష్ట్రపతి అభ్యర్ధి కోసం ఎన్‌డీఏలోని ప్రధాన పార్టీ బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడినే చేస్తారా? లేదా ప్రచారంలో ఉన్నట్టు ఎస్టీ మహిళకు అవకాశం ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. లేదంటే గనక అన్ని పార్టీల మద్ధతుండే ముస్లిం మైనార్టీ గులాం నబీ ఆజాద్‌ను ఖరారు చేయవచ్చు. వెంకయ్య నాయుడుకు అవకాశం ఇస్తే ఉత్తరాది పార్టీ అన్న ముద్ర చెరిపేయవచ్చు. ఎస్టీ మహిళకు అవకాశం ఇస్తే తొలిసారి ఆ సామాజివ వర్గానికి అవకాశం ఇచ్చినట్టవుతుంది. గులాం నబీ ఆజాద్‌కు ఇస్తే ముస్లిం వ్యతిరేకి అనే ముద్ర పోవడంతో పాటు కశ్మీర్ నుంచి తొలిసారి రాష్ట్రపతి అవుతారు. మరి ఎవరిని బరిలో దింపుతారో తేలాల్సి ఉంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి పదవికి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.

కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక గవర్నర్ ఎస్సీ సామాజివ వర్గానికి చెందిన తావర్ చంద్ గెహ్లోత్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టినా ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ లేదు కాబట్టి ఇతర పార్టీల మద్ధతు తీసుకోవాలి. ఇంతకుముందైతే అకాళీదళ్, టీఆర్ఎస్, శివసేన వంటి పార్టీలు సపోర్ట్ చేశాయి. కానీ, ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పార్టీలు బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. ఎలక్టోరల్ కాలేజీ లెక్కల ప్రకారం ఎన్డీఏ కూటమికి 9194 ఓట్లు తక్కువున్నాయి. దీంతో మద్ధతు కోసం బీజేడీ, వైసీపీ వంటి పార్టీల సహకారం తీసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. ఈ పరిస్థితిని ముందే గమనించిన వైసీపీ నాయకత్వం మద్ధతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, అందుకు కొన్ని షరతులు పెట్టాలని యోచిస్తోంది. కొన్ని విషయాల్లో మరింత స్పష్టత కోరే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్యా గతంలో తీసుకున్న నిర్ణయాలకు ముడిపెట్టకుండా మినహాయింపులు, పోలవరం నిధులు, అనేక రకాల అభివృద్ధి నిధులను కోరే అవకాశం ఉంది. అలాగే టీడీపీతో బీజేపీ పొత్తు గురించి స్పష్టత కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ అగ్రనాయకత్వంతో వచ్చే వారం చర్చించాలని వైసీపీ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది.