మ్యాచ్ నేర్పిన గుణపాఠం.. జింబాబ్వే అధ్యక్షుడు, పాక్ ప్రధాని మధ్య మాటల యుద్ధం
టీ20 వరల్డ్ కప్‌లో పటిష్టమైన పాకిస్తాన్ జట్టు పసికూన వంటి జింబాబ్వే చేతిలో ఓడిపోవడం సంచలనంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితంతో జింబాబ్వే ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. దేశ అధ్యక్షుడు ఎమర్సన్ దంబుద్జో ఎంనంగాగ్వా ఈ ఊపులో పాకిస్తాన్ దేశాన్ని చులకన చేస్తూ వ్యాఖ్యానించారు. ఈ సారైనా రియల్ మిస్టర్ బీన్‌ని పంపండి అంటూ ఎద్దేవా చేశారు. దీనికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అంతే ధీటుగా స్పందించి జింబాబ్వే జట్టు ప్రదర్శనను మెచ్చుకున్నారు.
‘మా వద్ద రియల్ బీన్ లేకపోవచ్చు. కానీ, నిజమైన క్రీడా స్పూర్తి ఉంది. అంతేకాదు, మరో సరదా అలవాటు ఉంది. పడిన చోటే ఉండిపోకుండా వెంటనే లేచి పుంజుకుంటాం. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ ప్రెసిడెంట్.. ఈ రోజు మీ జట్టు బాగా ఆడింది’ అంటూ విష్ చేశారు. అయితే ఈ మిస్టర్ బీన్.. నకిలీ బీన్ అనేది ఏంటనే ఆసక్తి నెలకొంది. దీని గురించి ఆరా తీయగా గతంలో పాక్ చేసిన మోసం బయటపడింది. నవ్వులు పూయించే మిస్టర్ బీన్ అందరికీ తెలిసిందే. అచ్చం ఆయన పోలికలతో ఉండే వ్యక్తి పాకిస్తాన్‌లో ఉన్నాడు. ఒరిజినల్ బీన్‌లాగే నవ్విస్తూ ప్రోగ్రాంలు చేసేవాడు. ఆయన ఓ సారి జింబాబ్వే దేశానికి ప్రదర్శన నిమిత్తం వెళ్లగా.. అక్కడి జనాలు నిజమైన బీన్ అనుకొని టిక్కెట్లు కూడా కొనేశారు. కానీ, తర్వాత నకిలీ బీన్ అని తేలడంతో ఒక్కసారిగా షాకయి మోసం చేసిన పాకిస్తాన్‌ను తిట్టి పోశారు. ఆ సంఘటనను తాజా గెలుపుతో గుర్తు తెచ్చుకొని దేశ అధ్యక్షుడు సైతం వెటకారంగా స్పందించడం గమనార్హం.