వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర - MicTv.in - Telugu News
mictv telugu

వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర

September 27, 2020

President Ram Nath Kovind gives assent to 3 contentious farm bills..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి తీవ్ర నిరసనలు వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే. హర్యాణా, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో రైతులు రాస్తారోకోలు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ బిల్లుతో రైతు పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారుతాడని.. ఈ బిల్లును తక్షణమే వెనక్కు తీసుకోవాలని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కనీస మద్దతు ధరకు గ్యారెంటీ ఉండదని కాంగ్రెస్ వాదించింది. అయితే ఈ బిల్లులతో ఎవరికీ నష్టం ఉండదని బీజేపీ చెబుతోంది. వ్యవసాయ బిల్లులపై ఉభయ సభల్లోనూ విపక్షాలు ఆందోళన తెలిపినప్పటికీ, మూజువాణి ఓటుతో బిల్లులను ప్రభుత్వం గెలిపించుకుంది. 

నాటకీయ పరిస్థితుల మధ్య వ్యవసాయ బిల్లులు ఉభయసభల ఆమోదం పొందడంతో వర్షాకాల సమావేశాలు ఇటీవల ముగిశాయి. ఇలా ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తుండగా.. ఈ మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం నాడు ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద బిల్లులను ఆమోదించవద్దని కోరుతూ ప్రతిపక్షాలు రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించాయి. వ్యవసాయ బిల్లుల అంశంపై ఎన్డీయే నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ వైదొలిగింది. కాగా, రాష్ట్రపతి వ్యవసాయ బిల్లులపై ఆమోద ముద్ర వేయడంపై కాంగ్రెస్ స్పందించింది. కార్పొరేట్ గుత్తాధిపత్యానికి తెరలేపి, రైతు నడ్డివిరిచారంటూ మండిపడుతోంది.