చీపురు పట్టి, గుడిని శుభ్రం చేసిన..రాష్ట్రపతి అభ్యర్థి - MicTv.in - Telugu News
mictv telugu

చీపురు పట్టి, గుడిని శుభ్రం చేసిన..రాష్ట్రపతి అభ్యర్థి

June 22, 2022

భారతదేశ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్టీయే తరఫున ద్రౌపది ముర్మూ, విపక్షాల తరుపున మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాలను రాష్ట్రపతి అభ్యర్థులుగా మంగళవారం ఆయా పార్టీల అధ్యక్షులు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్డీయే తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనా ద్రౌపది ముర్మూ తన నిరాడంబరతను చాటుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన సందర్భంగా ఆమె బుధవారం ఉదయం ఒడిశాలోని మయూరంజ్ జిల్లాకు చెందిన రాయ రంగపుర్‌లోని శివాలయానికి వెళ్లారు. అనంతరం గుడిలోకి వెళ్లి, దర్శనం చేసుకోకుండా చీపురు పట్టి, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.

ఈ క్రమంలో ద్రౌపది ముర్మూకు నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పించింది. సీఆర్‌పీఎఫ్ కమాండోలు ఆమెకు రక్షణ కవచంలా ఉంటారని అధికారులు వెల్లడించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ..” దేశ అత్యున్నత పదవికి ఒడిశా నుంచి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్మూకు అభినందనలు. ప్రధానమంత్రి ఈ విషయంపై చర్చించినప్పుడు చాలా సంతోషించాను. ఇది ఒడిశా ప్రజలకు ఎంతో గర్వకారణం” అని ఆయన అన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీతోపాటు కేంద్ర మంత్రులు పాల్గొని, సుదీర్ఘ చర్చి జరిపి, ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, ఇప్పటికే అనేక పదవులు చేపట్టిన ఆమె.. ఆహారాల్నీ పక్కన పెట్టి నేడు రాయ రంగపుర్‌లోని శివాలయానికి వెళ్లి గుడిని శుభ్రం చేసి తన భక్తి భావాన్ని చాటుకోవడంతో పలువురు నాయకులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.