Presidential election today..Results on 21st..
mictv telugu

నేడే రాష్ట్రపతి ఎన్నిక..21న ఫలితాలు..

July 18, 2022

 

భారతదేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు ఇటు పార్లమెంట్‌లో అటు ఆయా రాష్ట్రాల్లో సర్వం సిద్దమైంది. రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీయే తరుపున ద్రౌపది ముర్మూ, విపక్షాల తరుపున యశ్వంత్‌ సిన్హా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికకు మొత్తం 4,800 ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి సోమవారం ఓటు వేయనున్నారు. ఢిల్లీలో పార్లమెంట్‌ హౌస్‌లో, ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాలకు తరలించింది.

ఇక, ఈ రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు ఈనెల 21న వెలవడనున్నాయి. అనంతరం నూతన రాష్ట్రపతిగా ఈనెల 25న ప్రమాణస్వీకారం జరుగుతుంది. ఇప్పటికే ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లు కూడగట్టుకున్న ముర్ము.. మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేలా కన్పిస్తున్నారు. మొత్తం 10,86,431 ఓట్లలో ఆమెకు 6.67 లక్షల పై చిలుకు ఓట్లు ఇప్పటికే ఖాయమయ్యాయి. 15వ రాష్ట్రపతిగా ఆమె ఎన్నికైతే, ఈ పదవికి ఎన్నికైన తొలి గిరిజన మహిళగా ముర్ము రికార్డు సృష్టించనున్నారు. అంతేగాక ప్రతిభా పాటిల్‌ తర్వాత ఈ అత్యున్నత పదవి చేపట్టనున్న రెండో మహిళ అవుతారు.

”రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఉంటారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. నామినేటెడ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కుండదు. సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగుతుంది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేయలేవు. కాబట్టి క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశముంటుంది.”