దళిత నేతకు దక్కిన గౌరవం..! ఎవరీ రామ్ నాథ్..? - MicTv.in - Telugu News
mictv telugu

దళిత నేతకు దక్కిన గౌరవం..! ఎవరీ రామ్ నాథ్..?

June 19, 2017

రాష్ట్రపతి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్ కు బీజేపీ తెరదించింది. ఎన్డీయే త‌మ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎవ‌రూ ఊహించ‌ని రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రామ్‌నాథ్‌ ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తిగాపనిచేశారు. బీజేపీలో దళిత నేతగా ఎదిగిన రామ్‌నాథ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రెండుస్లారు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇంతకీ ఈ రామ్ నాథ్ ఎవరు…బ్యాక్ గ్రౌండ్ ఏంటీ…దీని వెనుక బ‌ల‌మైన వ్యూహ‌మే ఉందా?

సుదీర్ఘ చర్చల తర్వాత రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ పేరు నిర్ణయించినట్లు బీజేపీ చీఫ్ అమిత్‌ షా తెలిపారు. పార్టీలో అత్యంత ఉన్నతస్థాయికి ఎదిగిన దళిత నేత రామ్‌నాథ్‌ అని కొనియాడారు. ఎన్డీయే అభ్యర్థి ఎవరన్న విషయాన్ని విపక్షాలకు ఫోన్‌ ద్వారా తెలియజేశామని.. వారంతా పార్టీలో చర్చించుకుని తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఈ సమావేశంలో చర్చించలేదని అమిత్‌ అన్నారు.

రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్టోబర్‌ 1, 1945లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ దెహత్‌ జిల్లాలోని డేరాపూర్‌ తహశీల్‌లోని పరాంఖ్‌ గ్రామంలో పుట్టారు. అడ్వ‌కేట్‌గా ఆయ‌న కెరీర్‌ను మొద‌లుపెట్టారు. ఢిల్లీ హైకోర్టులో 1977 నుంచి 79 వ‌ర‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ అడ్వ‌కేట్‌గా ఉన్నారు. 1980 నుంచి 93 వ‌ర‌కు సుప్రీంకోర్టులో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ స్టాండింగ్ కౌన్సిల్ స‌భ్యుడిగా ఉన్నారు. 1978లో ఆయ‌న సుప్రీంకోర్టులో అడ్వ‌కేట్‌-రికార్డ్‌గా ప‌నిచేశారు. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో ఆయ‌న 16 ఏళ్లు ప‌నిచేశారు. ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో 1971లో రామ్‌నాథ్ న్యాయ‌వాదిగా పేరు న‌మోదు చేసుకున్నారు.
ఇక రామ్‌నాథ్ రాజ‌కీయ కెరీర్ 1994లో మొద‌లైంది. అంచెలంచెలుగా పార్టీలో కీలక నేతగా ఎదిగి యూపీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. 1994 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. 1998 నుంచి 2002 వరకూ బీజేపీ దళిత్‌ మోర్చా అధ్యక్షుడిగా రామ్‌నాథ్‌ పనిచేశారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015 ఆగస్టు 16 నుంచి ఆయన బిహార్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. పార్ల‌మెంట్‌కు చెందిన‌ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ‌, హోంశాఖ‌, పెట్రోల్ మ‌రియు ఇంధ‌నం, సామాజిక న్యాయం, లా అండ్ జ‌స్టిస్‌, రాజ్య‌స‌భ హౌజ్ క‌మిటీల్లో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. రామ్‌నాథ్ భార్య పేరు స‌వితా కోవింద్‌. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పుడు రామ్ నాథ్ ను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

నిజానికి బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి, సుష్మా స్వ‌రాజ్‌, జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము పేర్ల‌ను బీజేపీ ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.ఎన్నో చ‌ర్చ‌ల త‌ర్వాత బీహార్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న రామ్‌నాథ్ పేరును బీజేపీ ప్ర‌క‌టించింది. దీని వెనుక బ‌ల‌మైన వ్యూహ‌మే ఉంది. రామ్‌నాథ్ ద‌ళితుడే కాదు రైతుబిడ్డ కూడా. యూపీలోని కోలి సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్యక్తి. వివాదర‌హితుడిగా పేరుంది. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీలు నో చెప్ప‌లేని ప‌రిస్థితి.యూపీలో ఒక‌ప్పుడు మాయావ‌తి కుల రాజ‌కీయాల‌కు రామ్‌నాథ్‌తోనే చెక్ పెట్టాల‌ని బీజేపీ భావించింది. ఇక కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో స‌న్నిహితంగా ఉండ‌టం కూడా ఆయ‌నకు క‌లిసొచ్చింది. ఇక బీహార్ గ‌వ‌ర్న‌ర్‌గా చేసిన అనుభ‌వం ఆయ‌న‌కు ప‌నికొస్తుంది.