రాష్ట్రపతి ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ యాదవ్ - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతి ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ యాదవ్

June 13, 2022

ప్రస్తుత రాష్ట్రపతి దవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 15న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగిన క్రమంలో దేశంలో రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. రామ్‌నాథ్‌ కోవింద్‌ తర్వాత తదుపరి రాష్ట్రపతి ఎవరనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వెల్లడించారు.

అయితే, ఆయన బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ కాదు. ఆయన పేరుతో మరో వ్యక్తి. బిహార్‌ సరన్ జిల్లా మర్‌‌హౌర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రహీమ్‌పుర్ గ్రామానికి చెందిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌(42) వ్యవసాయం చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆయనకు ఏడుగురు పిల్లలు కాగా.. పెద్ద కూతురికి ఇటీవలే పెళ్లి చేశారు. ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పేరే కలిగి ఉండి గతంలో పలుసార్లు ఎన్నికల్లో పోటీ చేయడంతో చాలా మంది గందరగోళానికి గురయ్యారు.
తాజాగా ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికోసం జూన్‌ 15న నామినేషన్‌ దాఖలు చేయడానికి ఇప్పటికే ఢిల్లీకి టికెట్‌ బుక్‌ చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు 2017లో రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తాను నామినేషన్‌ దాఖలు చేశానని.. అయితే, తనని ప్రతిపాదించే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో నామినేషన్‌ తిరస్కరణకు గురైందని తెలిపారు. కానీ, ఈసారి మాత్రం పక్కా ప్లాన్‌తో రెడీగా ఉన్నానని పేర్కొన్నారు.