14వ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌..! - MicTv.in - Telugu News
mictv telugu

14వ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌..!

July 20, 2017

అందరు అనుకున్నట్లే రామ్‌నాథ్ కోవింద్ భార‌త 14వ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌య్యారు. 65.65 శాతం ఓట్ల‌తో మీరాకుమార్‌పై సూపర్ మెజార్టీతో గెలిచారు. విపక్ష అభ్యర్థి మీరా కుమార్ 34.35 శాతం ఓట్ల‌తో స‌రిపెట్టుకున్నారు. లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ అనూప్ మిశ్రా.. రామ్‌నాథ్ గెలుపొందిన‌ట్లు ప్ర‌క‌టించారు. మెజార్టీ రాష్ట్రాల్లో రామ్‌నాథ్ కోవింద్‌కే స్ప‌ష్ట‌మైన ఆధిక్యం ల‌భించింది. రామ్‌నాథ్‌కు 2930 (విలువ 7,02,044) ఓట్లు రాగా.. మీరాకుమార్‌కు 1844 (విలువ 3,67,314) ఓట్లు వ‌చ్చాయి. 3,34,730 ఓట్ల తేడాతో రామ్‌నాథ్ విజ‌య బావుటా ఎగురవేశారు.

భార‌త్‌కు రాష్ట్ర‌ప‌తి అయిన రెండో ద‌ళిత నేత‌గా రామ్‌నాథ్ కోవింద్ నిలిచారు. రామ్‌నాథ్ విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షాలు సంబురాలు చేసుకుంటున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌షా.. రామ్‌నాథ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో తాను అడుగుపెట్ట‌డం భార‌త ప్ర‌జాస్వామ్య గొప్ప‌త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు భార‌త 14వ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్. ఇది త‌న‌కు చాలా భావోద్వేగాలతో కూడుకున్న క్ష‌ణ‌మ‌ని చెప్పారు. త‌న విజ‌యాన్ని కాంక్షించిన శ్రేయోభిలాషులకు, ప్ర‌త్య‌ర్థి మీరాకుమార్‌కు కూడా ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు, శుభాకాంక్ష‌లు చెప్పారు. ప్ర‌జ‌లు త‌న‌పై ఉంచిన బాధ్య‌త‌ను స‌మ‌ర్థంగా నిర్వహిస్తానని కోవింద్ చెప్పారు.