Press meet of four MLAs at Telangana Bhavan today
mictv telugu

మరికాసేపట్లో తెలంగాణ భవన్‌లో ఆ నలుగురు ఎమ్మెల్యేల ప్రెస్‌మీట్

October 27, 2022

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ వ్యవహారంలో కీలకంగా మారిన నలుగురు ఎమ్మెల్యేలు.. గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. వీరు ఏం మాట్లాడతారు అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై సీఎం కేసీఆర్.. నిన్న ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఫాంహౌజ్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. ప్రగతిభవన్కు వెళ్లిన వారిలో ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు ఇస్తామంటూ తమను కొందరు ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారంటూ ‘ఆపరేషన్ ఆకర్ష్’ గుట్టు రట్టు చేసిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కుట్రను బయటపెట్టిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులతో ముఖ్యమంత్రి కేసీఆర్ గత రాత్రి ప్రగతి భవన్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ ఆకర్ష్’ కుట్రను బయటపెట్టిన నలుగురు ఎమ్మెల్యేలను సీఎం అభినందించారు.