ప్రెజర్‌ కుక్కర్‌ రివ్యూ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రెజర్‌ కుక్కర్‌ రివ్యూ

February 21, 2020

టైటిల్‌: ప్రెజర్‌ కుక్కర్‌

నటీనటులు: సాయి రోనక్‌, ప్రీతి అస్రాని, తనికెళ్ల భరణి, రాహుల్‌ రామకృష్ణ

సంగీతం: సునీల్‌ కశ్యప్, రాహుల్‌ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌

దర్శకత్వం: సుజోయ్, సుశీల్‌

నిర్మాతలు: అప్పిరెడ్డి, సుశీల్‌ సుభాష్

నిడివి: 134.53 నిమిషాలు

సాయి రోనక్, ప్రీతి అస్రాని జంటగా సుజోయ్, సుశీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ప్రెజర్‌ కుక్కర్‌’. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. క్రిష్‌, నందినిరెడ్డి, విశ్వక్ సేన్, రాహుల్ సిప్లిగంజ్ వంటి సినీ ప్రముఖులు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సినిమాకు మరింత ప్లస్‌ పాయింట్‌ అయింది. ఇన్ని అంచనాల మధ్య ‘ప్రెజర్‌ కుక్కర్‌’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Pressure cooker telugu movie review

కథ:

సిద్దిపేటకు చెందిన నారాయణ (సీవీఎల్‌ నరసింహారావు) బంధువులు అందరూ అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో తన కొడుకు కిశోర్‌ (సాయి రోనక్‌)ను కూడా అమెరికాను పంపించాలని కోరుకుంటాడు. కిశోర్‌కు చిన్నప్పట్నుంచే అమెరికా గురించి వివరిస్తూ పెంచుతాడు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన కిశోర్‌ అమెరికా కోసం వీసా ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్‌కు వస్తాడు. ఈ క్రమంలో అనిత (ప్రీతి అస్రాని)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. కోశోర్ వీసా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు చందు(రాహుల్‌ రామకృష్ణ) సహాయం చేస్తుంటాడు. వరుసగా నాలుగు ప్రయత్నాల్లో వీసా రిజెక్ట్‌ అవుతుంది. దీంతో కిశోర్‌ వివిధ ప్రయత్నాల్లో వీసా పొందడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ సందర్భంలోనే అనుకోని ఆపదలో చిక్కుకుంటాడు. ఆ ఆపద నుంచి రావు (తనికెళ్ల భరణి) రక్షిస్తాడు. ఇంతకి రావుకు, కిశోర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏంటి? కిశోర్‌ అమెరికా వెళ్లాడా? లేదా? కిశోర్‌, అనితల ప్రేమ ఏమైంది? తెలుసుకోవాలంటే ‘ప్రెజర్‌ కుక్కర్‌’ సినిమా చూడాల్సిందే.

Pressure cooker telugu movie review

ఎవరెలా చేశారంటే..

ఈ చిత్రంలో హీరో, హీరోయిన్‌లుగా నటించిన సాయిరోనక్‌, ప్రీతి అస్రానీలు ఆకట్టుకున్నారు. సినిమా మొత్తం సాయి రోనాక్ చుట్టే తిరుగుతుండటంతో నటనకు మంచి స్కోప్‌ దొరికింది. వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. హావభావాలు గొప్పగా పలికించాడు. ప్రీతి క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఎంతో అనుభవమున్న నటిగా ప్రీతి కనిపిస్తుంది. దీంతో ఈ యువ నటీనటులకు 

నటనలో మంచి భవిష్యత్‌ ఉండే అవకాశం ఉంది. రాహుల్ రామకృష్ణ తన కామెడీతో నవ్విస్తాడు. తనికెళ్ల భరణి, సంగీత, నరసింహారావు, తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

ఎలా ఉందంటే..

దర్శకులు ‘ప్రెజర్ కుక్కర్’ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. రొటీన్ విషయాలు కాకుండా కాస్త కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నించారు. ఈ కథలో ప్రేమ,స్నేహం, కుటుంబం, దేశభక్తి, కెరీర్ ఇలా చాలా విషయాలను చర్చించారు దర్శకులు. సినిమాలోని సన్నివేశాలు, సంభాషణలు ఆకట్టుకుంటాయి. మేక్ ఇన్ ఇండియా గురించి చర్చిండం బాగుంది. తనికెళ్ళ భరణి కుటుంబానికి సంబంధించిన సన్నీ వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

సాంకేతిక నిపుణుల పనితీరు..ఈ సినిమాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ అందించిన బ్యాగ్రౌండ్‌ బాగుంది. క్లైమాక్స్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌ వచ్చి పాడే పాట యువతను ఆకట్టుకుంటోంది. నగేష్ బన్నెల్ సినిమాటోగ్రఫి బాగుంది. హీరోయిన్‌ అందాలను, కొన్ని పాటలను తమ కెమెరాతో మ్యాజిక్‌ చేశారు. ఎడిటర్ నరేష్ రెడ్డి జొన్న ఎడిటింగ్‌ బాగుంది. అప్పిరెడ్డి, సుశీల్ నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదని తెలుస్తోంది.

చివరగా.. మహాశివరాత్రికి విజిలేసిన ప్రెజర్ కుక్కర్