రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది..కాంగ్రెస్ కు బిగ్ షాక్..! - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది..కాంగ్రెస్ కు బిగ్ షాక్..!

July 17, 2017

రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ముగిసింది. పార్లమెంట్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. ఏపీలో నూరు శాతం పోలింగ్‌ నమోదైతే.. తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా తెగించి బరిలోకి దిగిన ఆ పార్టీకి ఫలితాలకు ముందే షాక్ తగిలింది. సరిగ్గా పోలింగ్ రోజు మిత్రపక్షం ఎన్సీపీ కాంగ్రెస్‌కు ‘హ్యండ్’ ఇచ్చింది. తీరా ఓటు దగ్గరికి వచ్చే సరికి కోవింద్‌కే తమ మద్దతు అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది.

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉదయం 10 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవ్వగా.. సాయంత్రం 5 గంటలతో ముగిసింది. వివిధ రాష్ట్రాల్లోని బ్యాలెట్‌ బాక్సులను ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నెల 20న లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీ అసెంబ్లీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సీఎం చంద్రబాబు, సభాపతి కోడెల, ఇతర ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌, సభాపతి మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

తెలంగాణలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు గానూ 117 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మజ్లిస్‌కు చెందిన అక్బరుద్దీన్‌ ఒవైసీ, తెరాసకు చెందిన మనోహర్‌రెడ్డి అనారోగ్యం కారణంగా ఓటింగ్‌కు దూరమయ్యారు. సీఎం కేసీఆర్‌ తొలి ఓటు హక్కును వినియోగించుకోగా.. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి చివరగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అటు ఏపీలో నూరు శాతం పోలింగ్‌ నమోదైంది. నిర్ణీత గడువు కంటే ముందుగానే ఇక్కడ నూరు శాతం ఓటింగ్‌ నమోదు కావడం హైలైట్. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకోగా.. సభాపతి తర్వాతి ఓటు వేశారు. పోలింగ్‌ ప్రారంభమైన గంటకే ఒకరిద్దరు మినహా తెలుగు దేశం ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేశారు.

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కూడా కొందరు ఎమ్మెల్యేలు హ్యాండిచ్చారు. ఆమె ఆదేశాలను ధిక్కరించి మరి ఓ ఎంపీ సహా ఆరుగురు ఎమ్మెల్యేలు కోవింద్‌కు ఓటేసినట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తృణమూల్ ఎమ్మెల్యే ఆసిస్ సాహా మాట్లాడుతూ.. తనతో పాటు మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు కోవింద్‌కు ఓటు వేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతు పలికిన మమతా బెనర్జీ… తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఆమెకే ఓటు వేయాలని చెప్పినా వీరు పట్టించుకోక పోవడం కొసమెరుపు.