మటన్ రూ.700 అని బోర్డు పెట్టాల్సిందే..
లాక్ డౌన్ లో మాంసం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా మాంసం ధరలు పెంచి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాంసం ధరల నియంత్రణ కోసం ఐదు మంది అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో డాక్టర్ బాబుబేరి, సింహా రావు, సుభాష్, నిజాం, ఖాద్రిలు సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ సోమవారం మణికొండ, బంజారాహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాలలోని ఎనిమిది మాంసం షాపులలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బంజారాహిల్స్ రోడ్ నం.11లోని టెండర్ కట్స్ మటన్ షాప్‌ను సీజ్ చేశారు. తనిఖీకి వెళ్లిన సమయంలో షాప్ బయట నో మటన్ బోర్డ్ పెట్టి ఉండగా.. లోపల 20కిలోల మటన్ కనిపించిందని అధికారులు తెలిపారు. నిల్వ ఉంచిన మటన్ నుంచి దుర్వాసన రావడంతో వెంటనే ఆ షాప్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాంసం ధర రూ.700 పేర్కొంటూ బోర్డ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని షాపుల నిర్వహకులను ఆదేశించారు.