పవిత్ర జలంతో కాల్చేస్తున్న ఫాదర్.. కరోనా టైం గురూ! - MicTv.in - Telugu News
mictv telugu

పవిత్ర జలంతో కాల్చేస్తున్న ఫాదర్.. కరోనా టైం గురూ!

May 18, 2020

7tvrg

తుపాకీ గురి పెట్టి ఎవరినో కాల్చుతున్నట్టుగా నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో నేరగాడో, పోలీసు అధికారో కాదు.. ఓ చర్చి ఫాదర్. అతని చేతిలో ఉన్నది కూడా నిజమైన తుపాకీ కాదు.. బొమ్మ తుపాకీ మాత్రమే. మరి ఆయనేంటి.. ఇలా బొమ్మతుపాకీతో ఉన్నారు అనుకుంటున్నారా. ఇక్కడే ఓ లాజిక్ దాగి ఉంది. ఆయన దానితో చర్చికి వచ్చే వారిపై పవిత్ర జలాలను పిచికారీ చేస్తున్నారు. కరోనా కారణంగా మనుషుల మధ్య దూరం పాటించడమే విరుగుడని చెప్పడంతో ఆయన ఈ విధంగా చేయాల్సి వచ్చింది. 

సాధారణంగా అయితే చర్చికి వచ్చే వారిపై పవిత్ర జలం ఫాదర్ దగ్గరకు రాగానే చల్లుతూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదరడం లేదు. దీంతో అమెరికాలోని డెట్రాయిట్ టిమ్ పెల్క్ (70) అనే ఫాదర్ సరికొత్త ఆలోచన చేశారు. హోలీ రోజు ఆడుకునే బొమ్మ తుపాకీతో జలం చల్లుతూ కనిపించారు. ఇలా చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తికి ఆస్కారం లేకుండా.. పవిత్ర జలం చల్లవచ్చనే ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టినట్టు ఆయన వెల్లడించారు. ఈ ఫొటోలు నెట్‌లో వైరల్ కావడంతో ఎవరికి నచ్చిన రీతిగా వారు కామెంట్లు పెడుతున్నారు. దీంతో వీటికి 5.6 లక్షల లైకులు, లక్షకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని వైద్యులు చెప్పినట్టుగా టిమ్ పెల్క్ వెల్లడించారు.