Prime Minister Modi bids farewell to departing Vice President Venkaiah Naidu
mictv telugu

వెంకయ్యనాయుడితో కలసి పనిచేయడం నా అదృష్టం: ప్రధాని మోడీ

August 8, 2022

వెంకయ్యనాయుడు అత్యంత ప్రజాధరణ ఉన్న నేత అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన సుదీర్ఘ అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. సోమవారం రాజ్యసభలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వీడ్కోలు సందర్భంగా మోడీ మాట్లాడుతూ… వెంకయ్య నాయుడు ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా.. సభా నాయకుడిగా అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారన్నారు. వెంకయ్య నిబద్ధత స్ఫూర్తిదాయకమని, ఆయన ఎప్పుడూ యువత భవిష్యత్తు కోసం తపించారన్నారు. భావితరాలకు వెంకయ్య ఆదర్శమని.. వెంకయ్యతో కలిసి పనిచేయడం తన అదృష్ట‌మ‌న్నారు.

యువ ఎంపీలను వెంకయ్య ప్రోత్సహించారని, కొత్తతరంతో అనుసంధానమయ్యారన్నారు. ‘‘వెంకయ్యనాయుడుతో భుజం కలిపి పనిచేసే అదృష్టం నాకు లభించింది. సమాజం, ప్రజాస్వామ్యం ఆయన్నుంచి చాలా నేర్చుకోవాలి. వెంకయ్య భాష, ఏకవాక్య సంబోధనలు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. అత్యంత సహజంగా ఉండే భాష.. ప్రజలకు ఆయన సూటిగా చెప్పే విధానం అనుసరణీయం. మన ఆలోచనలు గొప్పవే.. కానీ చెప్పే విధానమే ప్రజలను కార్యోన్ముఖులను చేస్తుంది. వెంకయ్యనాయుడి దక్షత, పనివిధానం మనందరికీ ఆదర్శం’’ అని మోదీ అన్నారు. ఈనెల 10వ తేదీతో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తిచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో నిర్వహించిన వీడ్కోలు ప్రసంగంలో ప్రధాని మాట్లాడారు.