గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా ఏడోసారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయిన ప్రధాని మోదీ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే తొలివిడత పోలింగ్ ముగియగా, మలివిడత పోలింగ్ ప్రచారం కోసం బీజేపీ భారీ ఎత్తున ప్రణాళిక రచించింది. అందులో భాగంగా ప్రధాని మోదీతో ఏకంగా 50 కిలోమీటర్ల మేర రోడ్ షో చేయించింది. ఇందులో 16 నియోజకవర్గాలు కవర్ అవుతుండగా, మొత్తం మూడున్నర గంటలు సమయం పట్టింది. దీంతో సుదీర్ఘ రోడ్ షో నిర్వహించిన నేతగా మోదీ రికార్డుల్లోకెక్కారు. గోద్రా అల్లర్లు చెలరేగిన నరోడా గామ్ ప్రాంతం నుంచి సాయంత్రం మొదలైన ఈ రోడ్ షో.. టక్కర్ బాపా నగర్, బాపు నగర్, నికోల్, అమ్రైవాడి, మణినగర్, డానిలింబ్డా, జమాల్ పూర్ ఖాడియా, ఎలిస్ బ్రిడ్జ్, వెజల్ పూర్, ఘట్లోడియా, నారన్ పూర్, సబర్మతి తదితర నియోజకవర్గాల మీదుగా సాగి గాంధీనగర్ సౌత్ నియోజకవర్గంలతో ఈ మెగా రోడ్ షో ముగియనుంది. వేలాది మంది పాల్గొన్న ఈ రోడ్ షో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ షోలో ప్రధాని 35 చోట్ల ఆగనున్నారు. దారిలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులు స్మారకాల వద్ద ఆగి ప్రసంగించనున్నారు. కాగా, మలివిడత పోలింగ్ డిసెంబర్ 5న 93 స్థానాలకు జరుగనుంది.