ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరో గౌరవం దక్కింది. శనివారం రోజున యూఏఈ ప్రభుత్వం మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జయాద్’ను అందించింది. కాగా, ఆదివారం రోజున బహ్రెయిన్ దేశం ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రినైసెన్స్’ అవార్డును ప్రకటించింది. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఈ అవార్డును మోదీకి బహూకరించారు.
ఈ సందర్భంగా బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపిన మోదీ అంతరిక్ష రంగం, సౌర శక్తి, సాంస్కృతిక రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. బహ్రెయిన్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఈ అవార్డును అందుకున్న అనంతరం ప్రధాని మాట్లాడుతూ..‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రినైసెన్స్ అవార్డును నేను వినమ్రంగా స్వీకరిస్తున్నా. భారత్-బహ్రెయిన్ దేశాల మధ్య ఎంత బలమైన స్నేహం ఉందో చెప్పేందుకు ఈ అవార్డే నిదర్శనం. బహ్రెయిన్‌తో ఇండియాకు వందలాది సంవత్సరాల నుంచే సత్సంబంధాలు ఉన్నాయి.’ అన్నారు.