తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ రాష్ట్రాలకు కేటాయించిన వందే భారత్ రైలును సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రారంభించడానికి సిద్ధమైంది. రెండ్రోజుల కింద చెన్నై నుంచి విశాఖ వచ్చిన ఈ రైలు.. శుక్రవారం హైదరాబాద్ చేరుకుంది. నగరం వైపు దూసుకొస్తున్న వందేభారత్ రైలు వీడియోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జనవరి 15 ఆదివారం రోజున ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభిస్తారని అందులో వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం పది గంటలకు పదో నెంబర్ ప్లాట్ ఫాంపై ప్రారంభమై విశాఖ వైపు పరుగులు తీయనుంది.
𝑽𝒂𝒏𝒅𝒆 𝑩𝒉𝒂𝒓𝒂𝒕 ~
‘Secunderabad to Vishakapatnam’
To be flagged off by Hon’ble PM Shri @NarendraModi on 15th January, 2023 from Secunderabad Railway Station. pic.twitter.com/SFZPMl12a9
— G Kishan Reddy (@kishanreddybjp) January 13, 2023
వరంగల్, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతూ రాత్రి 8.30 గంటలకు వైజాగ్ చేరుకోనుంది. ప్రతీరోజు ఉదయం విశాఖలో 5.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్ చేరనుంది. ఖమ్మంలో కూడా రైలును ఆపాలని అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం. ఈ రైలు వల్ల ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఈ మార్గంలో రద్దీ వలన ఎప్పుడు ప్రయత్నించినా టిక్కెట్లు, బెర్తులు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ క్రమంలో సుమారు 1200 మందిని ఏకకాలంలో గమ్యానికి చేర్చే వందేభారత్ రైలు ఆవశ్యకతను గుర్తించిన కేంద్రం.. పండుగ సందర్భంగా వందేభారత్ రైలును కేటాయించింది. ఈ రైలు వేగంగా ప్రయాణించడం వల్ల ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. కానీ టిక్కెట్ రేట్లు మాత్రం భారీగానే ఉండనున్నట్టు తెలుస్తోంది. ఛార్జీలు అధికారికంగా ప్రకటించనప్పటికీ దూరాన్ని బట్టి చూస్తే ఛైర్ కార్ రూ. 1700, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ రూ. 3100 ఉండవచ్చని సమాచారం.