ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19న ఆయన రాష్ట్రానికి వచ్చి రూ. 7 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుంచి విజయవాడకు వెళ్లే వందే భారత్ రైలును ప్రారంభించి రూ. 699 కోట్లతో స్టేషన్ డెవలప్ మెంట్ పనులకు భూమిపూజ చేస్తారు. తర్వాత రూ. 1850 కోట్ల వ్యయంతో 150 కిమీల పొడవున్న జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం కాజీపేటలో రూ. 521 కోట్ల వ్యయంతో నిర్మించే రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపుకు భూమిపూజ చేయనున్నారు. వీటితో పాటు రూ. 1410 కోట్లతో నిర్మించిన సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ స్టేషన్ల మధ్య 85 కిలోమీటర్ల డబ్లింగ్ లైన్ ని జాతికి అంకితం చేస్తారు. ప్రఖ్యాత హైదరాబాద్ ఐఐటీలో రూ. 2597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను జాతికి అంకితం చేసి అదే రోజున పరేడ్ గ్రౌండ్సులో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మేరకు ప్రధాని సభకు కావాల్సిన ఏర్పాట్లను అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీజేపీ ముఖ్య నేతలు పరిశీలించారు. కాగా, ప్రధాని రాక సందర్భంగా సీఎం కేసీఆర్ మళ్లీ మొహం చాటేస్తారని సమాచారం. క్రితం సారి ప్రధాని వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకోలేదు. ఈ సారి కూడా గతంలాగే మంత్రులను పంపి స్వాగతిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.