రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ

May 12, 2020

prime minister Narendra Modi announced new package

దేశంలో కరోనా వైరస్ ప్రభావం గురించి, లాక్ డౌన్ పరిణామాల గురించి ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రైతులు, మధ్య తరగతి ప్రజల కోసం ‘ఆత్మ నిర్భర్ ప్యాకేజీ’ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది దేశ జీడీపీలో 10 శాతం అని ఆయన తెలిపారు. ఒక్క వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోందని, ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచం యుద్ధం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 

ఓడిపోవడం, కుంగిపోవడం మానవాళికి ఇష్టం లేదని, మరింత ధృడ సంకల్పంతో మనం ముందుకెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. 2 లక్షల 88 వేల మంది కరోనా కారణంగా చనిపోయారని మోదీ గుర్తుచేశారు. అలాగే ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేద్దామంటూ పిలుపునిచ్చారు. భారతదేశం ఇప్పటివరకు ఎన్నో విపత్తులను సమర్థంగా ఎదురుకొందని తెలిపారు. కరోనాను కూడా ధీటుగా ఎదుర్కొంటోందని వెల్లడించారు. భారత్ తయారు చేస్తున్న ఔషధాలు ప్రపంచానికి వరంగా మారుతున్నాయని తెలిపారు. 2000 తొలినాళ్లలో వై2కే సమస్య ఏర్పడప్పుడు భారత నిపుణులు ధైర్యంగా సమస్యను ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రస్తుతం చాలా కీలక దశలో ఉన్నామని, స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా నివారణ మార్గమని స్పష్టం చేశారు.