నేను పిచ్చోడిని.. కోర్టులో ప్రధాని ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

నేను పిచ్చోడిని.. కోర్టులో ప్రధాని ప్రకటన

May 28, 2022

పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన మనీ లాండరింగ్ కేసులో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ శనివారం లాహోర్ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కోర్టులో మాట్లాడుతూ.. ‘నేనొక పిచ్చోడిని (మజ్నూని). పన్నెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదని, దాంతో పాటు ఇతర సదుపాయాలు కూడా పొందలేదని వెల్లడించారు. ‘వాటితో పాటు న్యాయపరమైన హక్కులను కూడా ఉపయోగించుకోలేక పోయాను. అప్పట్లో ఓ కార్యదర్శి చక్కెర ఎగుమతులకు సంబంధించిన ఓ నోట్ పంపాడు. అయితే ఎగుమతులకు పరిమితిని నిర్ణయిస్తూ ఆ నోట్‌ను తిరస్కరించాను. జరిగింది ఇదీ. కానీ నాపై మనీ ల్యాండరింగ్ అభియోగాలు మోపారు’ అంటూ తన వెర్షన్ కోర్టు ముందుంచారు. అంతేకాక, ‘భగవంతుని దయ వల్ల నేను ఇప్పుడు ఈ దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నాను. అయినా బాధ్యత గల పౌరుడిగా కోర్టు ముందు హాజరయ్యాను’ అని తెలిపారు. కాగా, 2నవాజ్ షరీఫ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సోదరుడైన షాబాజ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో 14 బిలియన్ల పాకిస్థానీ రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని ఎఫ్ఐఏ ఆరోపిస్తోంది. దీంతో పాటు షాబాజ్ కుటుంబానికి చెందిన 28 బినామీ ఆస్తుల ఖాతాలను గుర్తించింది. కాగా, షాబాజ్ షరీఫ్‌కు ఇద్దరు కుమారులు. ఒకరు హంజా షరీఫ్ ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో కుమారుడు సులేమాన్ ప్రస్తుతం పెదనాన్న నవాజ్ షరీఫ్‌తో కలిసి బ్రిటన్‌లో ఉంటున్నాడు.