ప్రిన్స్... మూవీ రివ్యూ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రిన్స్… మూవీ రివ్యూ

October 21, 2022

‘జాతిరత్నాలు’ ఫేమ్‌ కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్‌, ఉక్రెయిన్ నటి మారియా హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన తాజా చిత్రం ‘ప్రిన్స్‌’. దీపావళి సందర్భంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా జనాలను ఆకట్టుకుందా? రెండు భాషల్లోనూ అలరించిందా? ఏమిటీ కామెడీ?
కథ విషయానికొస్తే..

ఆనంద్‌(శివకార్తికేయన్‌) ఓ ఊరిలో టీచర్‌గా పనిచేస్తుంటాడు. అదే స్కూల్‌లో బ్రిటన్‌ అమ్మాయి జెస్సికా(మారియా) ఇంగ్లీష్ టీచర్‌గా చేరుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. మరోవైపు ఆనంద్‌ తండ్రి(సత్యరాజ్‌) మనుషుల్లో కులాలు, మతాల తేడాలుండకూడదని, ఏ పంచాయితీకి వెళ్లి అవకాశం దొరికినా తనదైన శైలిలో స్పీచు దంచి అందుబాటులో ఉన్నవాళ్ల చేయి లాగి కోసి మరీ అందరి రక్తం ఒకటే అని చాటిచెప్తుంటాడు. తన కొడుకైన ఆనంద్‌ కూడా వేరే కులం, వేరే మతం అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంటాడు. తీరా వేరేదేశం అమ్మాయిని ప్రేమించాడని తెలిసి ఎగిరి గంతేసినా, ఆ తర్వాత ఓ విషయంలో రియలైజయ్యి పెళ్లికి ఒప్పుకోడు. అంతవరకూ బానే ఉన్న అతను ఎందుకిలా మారాడు? ఇంతకీ జెస్సికా తల్లిదండ్రులు ఆమె ప్రేమని ఒప్పుకున్నారా? ఊళ్లోవాళ్లంతా ఎందుకు ఆనంద్‌, జెస్సికా ప్రేమని వ్యతిరేకిస్తారు? చివరిగా వీళ్ల ప్రేమ ఎలా సుఖాంతమయింది అనేదే కథ. నిజానికి చాలా సింపుల్‌ కథే. ట్రైలర్లోనే ఈ స్టోరీని రివీల్ చేశారు కూడా. మరి ఇలాంటి కథతో తనదైన కథనంతో దర్శకుడు కేవీ అనుదీప్‌ ప్రేక్షకులని అలరించడంలో సక్సెసయ్యాడా అంటే చాలా వరకు అవుననే చెప్పాలి.
దర్శకుడు, నటీనటుల పనితీరు..

‘జాతిరత్నాలు’ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు అనుదీప్‌. సాదా సీదా కథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా సినిమా తెరకెక్కించడంతో పాటు, తన పెన్నుతనం చూపేలా డైలాగులు, పంచుల్ని పేలుస్తుంటాడు. జాతిరత్నాలు తర్వాత తమిళ్, తెలుగులో ఈ సినిమా వస్తుందని తెలియడం, హీరోయిన్‌ విదేశీయురాలు అని అనౌన్స్‌ కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే, మేకింగ్‌లో తన శైలిని వదలకుండా ఆసాంతం నవ్వించేలా సినిమాను డైరెక్ట్‌ చేశాడు అనుదీప్‌. ఫస్టాఫ్‌ అంతా పాత్రలు పరిచయమవ్వడం, లవ్‌ ట్రాక్‌ స్మూత్‌గా నడుస్తుండడం, కథకి తగ్గట్టుగా వచ్చే పాటలతో అలా సాగిపోతుంది. ఘర్షణును కరెక్ట్‌గా లాక్‌ చేస్తూ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగా ప్లాన్ చేశాడు. కానీ సెకండాఫ్‌ ప్రారంభమైన కాసేపటివరకూ కాస్త బోర్ అనిపించినా, కథను దాటకుండా, పట్టు తప్పుకుండా మెల్లిగా మళ్లీ ట్రాక్‌ ఎక్కించి క్లైమాక్స్‌లో నవ్వించి అలరించాడు.

ఇలాంటి కామెడీ కథలను తెరకెక్కించేప్పుడు ఏ కాస్త లైన్‌ తప్పినా సినిమా మొత్తం ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. ఇటీవల విడుదలైన ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ చిత్రానికి కథ, మాటలు అందించింది అనుదీపే. జాతి రత్నాలు సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వంశీతో ఆ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయించినా ఫలితం తేడా కొట్టేసింది. అలాంటి కథల్ని తీయాలంటే అనుదీపే కరెక్టని మరోసారి ఈ చిత్రంతో ప్రూవయింది. హీరోగా శివకార్తికేయన్‌ పర్ఫామెన్స్‌ సూపర్‌. పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో ప్రేక్షకుల్ని ఎంతలా ఆకట్టుకోగలడో డాన్‌, డాక్టర్‌ సినిమాలతో నిరూపించుకుని తెలుగులోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ప్రిన్స్‌లోనూ సినిమా మొత్తం కనిపిస్తూ అనుదీప్‌ రాసుకున్న కథకి, క్యారెక్టర్‌తో పాటు ప్రేక్షకులు పెట్టిన టికెట్‌ డబ్బులకు కూడా న్యాయం చేశాడు.
ఇక హీరోయిన్‌ మారియా గతంలో స్పెషల్ ఓపీఎస్ 1.5 అనే హిందీ వెబ్ సీరీస్‌లో నటించినా కొన్ని సీన్లకు మాత్రమే పరిమితమైంది. అలాంటి విదేశీ నటితో తమిళ్, తెలుగు సినిమా వర్కటవుతుందా అనుకున్నారంతా. కానీ ఎక్స్‌ ప్రెషన్స్‌ దగ్గర్నుంచీ, డ్యాన్స్‌, ఫన్నీ సీన్స్‌లోనూ తన పర్‌ఫామెన్స్‌తో యూత్‌ పాలిటి లేటెస్ట్‌ క్రష్‌గా మారిపోయింది. కానీ సినిమాలో తన పాత్ర డబ్బింగే కాస్త ఇబ్బదికరంగా అనిపిస్తుంది. అసలే బ్రిటన్ అమ్మాయి పాత్ర. అందులోనూ తమిళ్‌ డైలాగులు చెప్పించి మళ్లీ వాటిని తెలుగులోకి డబ్‌ చేశారు. కానీ కొన్నిసీన్లయ్యాక కథలో లీనమయ్యే సరికి ఆ డబ్బింగ్ కూడా అలవాటైపోతుంది.ఇక హీరో తండ్రిగా సత్యరాజ్‌ చక్కగా కుదిరాడు. చాలా సీన్లలో శివకార్తికేయన్‌ టైమింగ్‌కి పోటీగా నటించాడు. మనోజ్‌ పరమహంస కెమెరా వర్క్ తెరమీద బాగా కనపడింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా థమన్‌ తన వంతు న్యాయం చేశాడు.

సినిమా సక్సెసయినట్టేనా?

ఈ శుక్రవారం దీపావళి స్పెషల్‌ గా నాలుగు చిత్రాలు రిలీజయ్యాయి. ఒక్కోటి ఒక్కో జానర్. ఇక ప్రిన్స్‌ విషయానికొస్తే.. అనుదీప్‌ మార్క్‌ కామెడీతో ఆడియెన్స్‌ హాయిగా నవ్వుకోవచ్చు. బాడీ షేమింగ్, డబుల్‌ మీనింగ్ డైలాగులు లేకుండా ఓ చక్కటి సోషల్‌ మెసేజ్‌తో పాటు పంచులతో అలరించాడు. పండగపూట కుటుంబం అంతా కలిసి నవ్వుకోడానికి ఓ సినిమాకెళ్లాలంటే ప్రిన్స్‌ను ప్రిఫర్ చేయొచ్చు. పెద్ద అంచనాలు లేకుండా, మరీ పొట్టచెక్కలయ్యే కామెడీ కాకుండా సింపుల్‌ స్టోరీ, సెన్సిబుల్‌ ఫన్‌ని ఫీలవ్వాలంటే ఛలో ప్రిన్స్‌. అనుదీప్‌ స్టయిల్లోనే చెప్పాలంటే ఇలాంటి చిత్రాలు గతంలోనూ చాలా వచ్చాయి. కానీ ఇదే మొదటి సారి.