మద్యం వాసన రావడంతో శానిటైజర్ తాగి ఖైదీ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

మద్యం వాసన రావడంతో శానిటైజర్ తాగి ఖైదీ మృతి

March 27, 2020

Prisoner Drink Sanitizer in Kerala

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా శానిటైజర్లు చేతులకు వాడుతున్న సంగతి తెలిసిందే. అల్కాహాల్ కంటెంట్ ఉన్న వీటిని చేతికి రాసుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందడం తగ్గించవచ్చు. ఇలాగే జైల్లోని ఖైదీలకు కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో అపశృతి చోటు చేసుకుంది. శానిటైజర్ ఆల్కాహాల్ వాసన రాడంతో దాన్ని తాగిన ఓ ఖైదీ మరణించాడు. కేరళలోని పలక్కాడ్ కారాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడాలని ప్రభుత్వాలు సూచించడంతో జైలు అధికారులు ఖైదీలతోనే వాటిని తయారు చేయించి వాడటం ప్రారంభించారు. శానిటైజర్ల తయారీ సమయంలో ఆల్కాహాల్ వాసన రావడంతో రామన్ కుట్టి అనే ఖైదీ ఎవరికీ తెలియకుండా తాగాడు. కొంత సేపటికి అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన అధికారులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

కాగా రామన్ కుట్టి ఫిబ్రవరి 18న దొంగతనం కేసులో పట్టుబడ్డాడు. అతడి కేసు ఇంకా ట్రయల్ దశలోనే ఉంది. ఈ క్రమంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఆల్కాహాల్ అనుకొని దాన్ని తాగాడా అనే కోణం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.