హమ్మయ్య.. ఖైదీల్లో అయినా పరువు దక్కించుకున్నాం.. - MicTv.in - Telugu News
mictv telugu

హమ్మయ్య.. ఖైదీల్లో అయినా పరువు దక్కించుకున్నాం..

March 24, 2018

భారత్.. జీవన ప్రమాణాల్లో అట్టడుగున ఉంది. సంతోషం, సుఖం లేదు, ఎక్కడ చూసినా దరిద్రం.  అవినీతి పెచ్చరిల్లింది. కాలుష్యం కాటేస్తోంది. టాప్ వర్సిటీల్లో ఒక్కటీ భారత్ నుంచి లేదు.. ఇలాంటి ఎన్నెన్నో విషాదాలు, విలాపాల మధ్య కాసింత తృప్తి కలిగించే వార్త ఇంది. ఖైదీల విషయంలో మనం కాస్త పరువు కాపాడుకున్నాం. మన దేశంలో నేరస్తులు పెద్దగా లేరంట. ప్రతి లక్ష మందిలో కేవలం 33 మంది మాత్రమే జైళ్లలో ఉన్నారు. ఇన్ స్టిట్యూట్ ఫర్ క్రిమినల్ పాలసీ రీసెర్చ్ గణాంకాల్లో మన ఖైదీల, జైళ్ల స్థితిగతులను వివరించారు.

అమెరికాలో ప్రతి లక్షమందికి 666 మంది జైళ్లతో ఉన్నారు. ఈ జాబితాలో అగ్రరాజ్యమే టాప్. రష్యాలో 410 మంది, జైళ్ల నేరాలకు అడ్డా అయిన బ్రెజిల్లో 323 మంది కటకటాల వెనక ఉన్నారు. మన దాయాది పాకిస్తాన్‌లో 44 మంది, నేపాల్లో 65 మంది, శ్రీలంకలో 78 మంది, బంగ్లాదేశ్లో 48 ఉన్నారు. చైనాలోనూ జైలుపక్షులు ఎక్కువే. లక్షకు 118 మంది మగ్గుతున్నారు.

సంఖ్యాపరంగా చూస్తే భారత్‌లో 4,19,623 మంది, అమెరికాలలో 21,45,100, చైనాలో16,49,804 ఊచలు లెక్కపెడుతున్నారు. భారత్ జైళ్లలో ఉన్నవాళ్లందరూ దోషులు కారు. 67శాతం మంది విచారణ ఖైదీలే. జైళ్లలో ఖైదీల సాంద్రత (జనసాంద్రత మాదిరి)లో హైతీ అగ్రస్థానంలో ఉంది. అక్కడ 454 శాతం కాగా, అమెరికాలో ఇది 104 శాతం, భారతదేశంలో 114 శాతం.