టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీషాపై గురువారం దాడికి పాల్పడిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కం నటి సప్న గిల్‌తో పాటు ఆమె గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండుకు తరలించారు. ముంబైలోని ఓ స్టార్ హోటల్ వద్ద లంచ్ చేయడానికి వెళ్లిన షా అతని స్నేహితుడు సురేంద్రయాదవ్.. హోటల్ నుంచి తిరిగి వస్తుండగా, సప్న గ్యాంగ్ అడ్డుకుని సెల్ఫీ కోసం ఇబ్బంది పెట్టింది. ఒకసారి సెల్ఫీ ఇచ్చి వెళ్లిపోబోయిన షాను పదే పదే విసిగించడంతో హోటల్ సిబ్బంది స్పందించి సప్న గ్యాంగ్‌ని బయటికి పంపించేశారు. దీన్ని అవమానంగా భావించిన సదరు గ్యాంగ్.. షా కారను వెంబడించి అతనిపై దాడికి పాల్పడ్డారు. ఇదంతా వీడియోలో రికార్డయి వైరల్ కావడంతో షా తన స్నేహితుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు సప్నగిల్‌తో పాటు మిగతా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ సమయంలో షానే తనపై బ్యాటుతో దాడికి పాల్పడ్డాడని సప్న వాదించడం గమనార్హం. కాగా, సప్న గిల్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఇన్‌స్టాలో ఆమెకు 2 లక్షల 20 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. డ్యాన్స్ వీడియోలు చేసి అందులో పోస్ట్ చేస్తుంటుంది. అంతేకాక, కాశీ అమర్‌నాథ్, మేరా నావత్ వంటి భోజ్‌పురి సినిమాల్లో నటించింది. అటు సప్నగిల్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరింత ఫేం రావడం కోసం సప్న గ్యాంగ్ ఆడిన నాటకం అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం సెలబ్రిటీలతో ఆడుకుంటున్నారని, ఫాలోవర్లను పెంచుకునే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగి ఉంటుందని ఆరోపిస్తున్నారు.