ఇండియాలో సినిమా స్టార్లు, క్రికెట్లర్లపై ప్రజలకు ఉన్న మోజు అంతాఇంతా కాదు. వారి కోసం అభిమానులు ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమా స్టార్ల విషయంలో ఆ వ్యామోహం కొంత తగ్గిందనిపిస్తున్నా క్రికెటర్లపై మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్నిసార్లు అభిమానులు చేసే చేష్టల వల్ల క్రికెటర్లు కూడా ఇబ్బంది పడతారు. తాజాగా ముంబైలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషా సెల్ఫీ ఇవ్వలేదనే కోపంతో ఇద్దరు వ్యక్తులు అతని స్నేహితుని కారును ధ్వంసం చేశారు. అంతేకాక, రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై సదరు స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకెళితే.. ముంబైలో బుధవారం సాయంత్రం పృథ్వీషా తన స్నేహితుడితో కలిసి మ్యాన్సన్ క్లబ్ ఆఫ్ సహారా అనే స్టార్ హోటల్‌కి వెళ్లాడు. తిరిగి వస్తుండగా, ఇద్దరు వ్యక్తులు పలకరించి సెల్ఫీ అడగడంతో షా కాదనలేక ఇచ్చేశాడు. అయితే అంతటితో సరిపెట్టుకోక ఇంకోటి కావాలని అడగడంతో నిరాకరించిన షాపై కోపం పెంచుకున్నారు. పదే పదే సెల్ఫీ కోసం షాను విసిగించగా, స్పందించిన హోటల్ సిబ్బంది వారిద్దరిని అక్కడినుంచి వెళ్లగొట్టేశారు. కొంతసేపటికి షా తన స్నేహితుడితో కారు వద్దకు రాగా, అక్కడే నక్కి ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు కారుపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. దాడి సమయంలో కారులోనే ఉన్న షా స్నేహితుడిని రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే తప్పుడు కేసు పెడతామని బెదిరించగా, షా వేరే కారులో అక్కడ్నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై షా స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిని సానాగిల్, శోభిత్ ఠాకూర్‌లుగా పోలీసులు గుర్తించారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.