బిల్లు బాకీ ఉంటే ఆ ఆసుపత్రుల గేటు దాటనివ్వరు..! - MicTv.in - Telugu News
mictv telugu

బిల్లు బాకీ ఉంటే ఆ ఆసుపత్రుల గేటు దాటనివ్వరు..!

July 7, 2017

ప్రాణాల విలువ ప్రైవేట్ ఆసుపత్రులకు తెలిసినంతగా ఎవరికి తెలియలేదు. పైసల విలువ అంతకన్నా ఎక్కువే. భూతద్దం వేసి వెతికినా వారిలో మానవత్వం మచ్చుకైనా కనిపించదు.ఒక్కమాటలో చెప్పాలంటే యుముడికి తమ్ముళ్లు…ఆ ఆసుపత్రులు వారి అడ్డాలు. ఖర్మ కాలి అందులో కాలు పెడితే బయటపడలేరు. నయా పైసా బాకీ ఉండనివ్వరు. బిల్లులు అన్ని కడితేనే పేషెంట్ ను వదలుతారు. లేదంటే చుక్కలు చూపిస్తారు. డెడ్ బాడీలతో ఆ ఆసుపత్రులు బిజినెస్ చేస్తాయ్..బతికున్న మనషులతోనూ ఆడుకుంటాయ్..జీవితంలో కోలుకోలేకుండా చేస్తాయ్. ఈ ఆసుపత్రుల ఆగడాలకు కళ్లెం వేసెదెప్పుడు..?లక్షలు లక్షలు బిల్లు కట్టినా…వేల రూపాయలు పెండింగ్ ఉన్నాయని గేట్ దాటనీయకపోవడం ఎంత వరకు న్యాయం..?

మహబూబ్‌నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మక్తల్ మండలం అంకెనపల్లికి చెందిన నాగరాజు, గోవిందమ్మలు అనారోగ్యంతో ఉన్న బాబు ను చేర్పించారు. చికిత్స తర్వాత బకాయి డబ్బులు చెల్లించలేదని సిబ్బంది బాబును తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు. బకాయి పడిన రూ. 18 వేలు చెల్లించాకే చిన్నారిని తీసుకెళ్లాలని తెగేసి చెప్పారు. ఇప్పటి వరకు రూ. 2 లక్షల మేర వైద్యఖర్చులు చెల్లించారు దంపతులు. ఆర్థిక స్థోమత లేక మిగతా డబ్బులు కట్టలేమని, తమ బాబును తిరిగి ఇవ్వాలని దంపతులు కోరారు. కానీ ఆసుపత్రి మేనేజ్ మెంట్ వారి గోస వినిపించుకోలేదు. ఇక ఏమి చేసేది లేక సాయం చేయాలంటూ ఆ పేద దంపతులు మహబూబ్‌నగర్ కలెక్టర్ ని కలిశారు.

ఇది వీళ్ల ఒక్కరి బాధే కాదు..ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. కొందరు బాకీ తెచ్చి బిల్లులు కట్టేస్తే..మరికొందరు వస్తువులు కుదవపెట్టి మరి చెల్లిస్తారు. ఉన్నోడికి ఎంత బిల్లు వేసినా కట్టొచ్చు..వాడిలాగే సామాన్యులకు బిల్లు వేస్తే…ఎడ తెస్తారు. లక్ష..రెండు లక్షలు అంటే భరిస్తారు అప్పులు చేసైనా…ఇంకా ఇంకా కట్టలంటే ఎట్లా..?

లేనివాళ్లు మా ఆసుపత్రులకు ఎందుకు రావాలంటారు కొందరు డాక్టర్లు..నిజమే సామాన్యులు కూడా మీ ఆసుపత్రులకు రావాలని ఎవరూ రారు. మీ చైన్ దందాలో గాలం వేస్తే పడే పేషెంట్లు కాబట్టే వచ్చేస్తారు.ఆర్ఎంపీలు కమీషన్ల కక్కుర్తి కోసం పంపిస్తారు. ప్రాణాల మీద ప్రేమతో వారు వచ్చేస్తారు..పాపం వాళ్లేకేం తెలుసు జలగల్లా పట్టిపీడిస్తారని…?

ఆరోగ్య శ్రీ ఉన్నా అక్కరకు రాదు..అన్ని రోగాలకు అది వర్తించదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొన్నింటికి పని చేసినా…టెస్టులు అన్ని బయటే చేయించుకోవాలి. ఇలా వేలకు వేలు బిల్లు అవుతున్నాయి. ఆరోగ్య శ్రీ ఉన్నా ఆసుపత్రులు వేసే అదనపు బిల్లూ ఉంటుంది. ఇలా అందులో చేరిన పేషెంట్ బయటకు వెళ్లాలంటే కుటుంబ సభ్యులు ఉన్నది ఊడ్చిపెట్టాలి..జ్వరం వచ్చింది అని వెళ్లినా జాయినింగ్ అనే ఆసుపత్రులు ఉన్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకుని వేలకు వేలు బిల్లు చేసి పంపిస్తారు. ఇంకేదైనా సీరియస్ సిచ్యూయేషన్ అయితే అంతే. జరగరానిది ఏదైనా జరిగి పేషెంట్ ప్రాణాలు పోయినా…డబ్బు చెల్లించేదాకా శవాన్ని ఇవ్వరు. చంచి ఏడుస్తున్నా చంపుకు తింటారు.

సో పెద్ద సమస్యలేమైనా ఉంటే గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్లండి…కష్టాలు ఎన్ని ఉన్నా అక్కడే చూపించుకోండి..తప్పదన్నప్పుడు కార్పొరేట్ ఆసుపత్రికి పోండి..అది ఇన్సూరెన్స్ ఉంటేనే..లేకపోతే నాలుగైదు లక్షల అప్పు పుట్టేలా ముందే ప్లాన్ చేసుకోండి..ఎందుకండి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అలా తయారయ్యాయ్..