నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో విద్యార్ధులతో కూడిన బస్సు నీటిలో చిక్కుకుపోయింది. మాచన్ పల్లి – కోడూరు మార్గంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరగా, రామచంద్రాపురం నుంచి సూగురు తండాకు వెళ్తున్న ప్రైవేటు స్కూలు బస్సు నీటిలో చిక్కకొని ముందుకు కదల్లేకపోయింది.
అంతేకాక, బస్సులో సగానికి నీళ్లు రావడంతో లోపల ఉన్న 23 మంది విద్యార్ధులు భయంతో కేకలు వేశారు. దీంతో బస్సును డ్రైవరు అక్కడే ఆపేశాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి డ్రైవరుతో సహా పిల్లలను సురక్షితంగా తరలించారు. ఆ తర్వాత ట్రాక్టరు తెచ్చి తాడు కట్టి లాగి బస్సును బయటికి తీశారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్.. విద్యార్ధులను కాపాడిన స్థానికులను అభినందించారు. నీళ్లు నిలిచిపోవడానికి కారణం రైల్వే శాఖ అని విమర్శించారు.