private school recited Kalima to students in UP
mictv telugu

విద్యార్ధులతో కలీమా పఠనం.. హిందూ సంఘాలు ఏం చేశాయంటే

August 1, 2022

యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న యూపీలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. కాన్పూరులోని ఓ ప్రైవేటు స్కూలులో విద్యార్థులతో కలీమా పఠనం (ఇస్లామిక్ పవిత్ర వచనం) చేయించారు. విషయం తెలిసి ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. స్కూళ్లలో ప్రార్ధనలు మామూలేనని,కానీ, ఇస్లామిక్ కలీమా చదివించడం ఎక్కడా చూడలేదని వారు వాపోయారు. వెంటనే భజరంగ్ దళ్, నగర బీజేపీ శాఖ కూడా రంగంలోకి దిగి అధికారులు, పోలీసులను స్కూలు వద్దకు తరలించాయి. యాజమాన్యం చేసిన పనితో స్కూలు అపవిత్రం అయిందని భావించి గంగా జలం తెప్పించి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అన్ని గదుల్లోనూ, స్కూలు ప్రాంగణంలో నీటిని చల్లారు. దీనిపై స్కూలు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..‘స్కూలు డైరీ ప్రకారం ప్రతి మతానికి చెందిన ప్రార్ధనలను ప్రతీ విద్యార్ధి పఠించాల్సి ఉంటుంది. ఈ విధానం అనేక ఏళ్లుగా మా స్కూలులో అమలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ అంశం వివాదాస్పదమైన నేపథ్యంలో ఇక నుంచి స్కూలులో ఎలాంటి ప్రార్ధనలు చేయకుండా వాటిపై నిషేధం విధిస్తున్నామ’ని వెల్లడించారు. అటు ఈ విషయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే యాజమాన్యం పైవిధంగా స్పందించడంతో ఎవరూ కూడా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.