మీ బండికి 20 ఏళ్లు దాటితే తుక్కే.. - MicTv.in - Telugu News
mictv telugu

మీ బండికి 20 ఏళ్లు దాటితే తుక్కే..

February 1, 2021

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా పాత సామాన్ల షాపుకు వేసేలా చట్టం తీసుకొస్తోంది. కాలుష్య నివారణ, ఇంధనం పొదుపు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది. త్వరలో దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

దీంతో తమ వద్ద ఉన్న పాత వాహనాల పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 10, 15 ఏళ్లు పైబడిన వాహనాలను తుక్కు కింద అమ్మేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలను, 15 ఏళ్లు దాటిన కమర్షియల్ వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు. పైకి పరీక్ష అని చెబుతున్నా.. ఆ గడవు తీరిన వాహనాలకు తిరిగి రోడ్లపైకి రాకుండా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది.
ఈ నిర్ణయం వల్ల ఆటో మొబైల్ పరిశ్రమ పుంజుకుంటుందని కేంద్రం భావిస్తోంది. అయితే టూవీలర్లను ఈ చట్టం నుంచి మినహాయించాలని సామాన్యులు కోరుతున్నారు. కార్లు, స్పోర్ట్ కార్లుతో పోలిస్తే టూవీలర్ల వల్ల కాలుష్యం తక్కువగానే ఉంటుందని, ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన వాహనాలు 80 లక్షలు ఉన్నాయి. 2025 నాటికి వీటి సంఖ్య రెండున్నర కోట్లకు చేరుతుంది.