వామ్మో..! డేటింగ్‌కు వస్తావా అంటున్నారు! - MicTv.in - Telugu News
mictv telugu

వామ్మో..! డేటింగ్‌కు వస్తావా అంటున్నారు!

February 14, 2018

కనుబొమల హావభావాలతో కోట్లాది మంది కుర్రకారు గుండెలను తొలిచేసిన మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌కు మీడియాలో ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. కేవలం కన్నుకొట్టి ఇంత చరిత్ర సృష్టించిన ఈ భామ వెంట యువకులు వేలం వెర్రిగా పరిగెడుతున్నారు. ‘వేలంటైన్స్ డే రోజున నాతో డేటింగ్ చేస్తావా?’ అంటూ ఆమె బాక్సులో మెసేజీలు గుప్పిస్తున్నారు.

కన్నుకొట్టిన పాట తర్వాత తనకు వస్తున్న మెసేజీలు, ప్రజాదరణ గురించి ప్రియ ఓ చానల్ తో ముచ్చటించింది. ‘ఒరు అదర్‌ లవ్‌లో నేను చేసిన ‘మణిక్య మలరయ’ పాటలో ఆ కన్నుకొట్టే సీన్ కు ఇంతమంది స్పందిస్తారని నేను అసలు ఊహించలేకపోయాను. చెప్పలేనంత సంతోషంగా ఉంది. నా మొత్తం జీవితమే మారిపోయింది. లక్షలాదిమంది అభిమానాన్ని, ఆదరణను ఎలా తట్టుకోవాలో అర్థం కాకుండా ఉంది…’ అని ఆమె ఉబ్బుతబ్బిబ్బైంది.‘సినిమాలో నా కనుబొమలతోనే హావభావాలు పలికించాలని డైరెక్టర్ చెప్పాడు. కేరళలో పాడుకునే ‘మప్పిళ’ పాటను ‘మణిక్య మలరయ’గా రీమేక్‌ చేశాం. ఇది నా గొప్పకాడు. దర్శకుడు చెప్పినట్టే చేశాను. ఆ వీడియో బయటికి రాగానే  నా ఇన్‌బాక్స్‌ మెసేజ్‌లతో నిండిపోయింది. వాలంటైన్స్‌ డే రోజున డేట్‌కి వస్తావా అని వేలమంది ప్రపోజ్ చేస్తున్నారు.. ఏం చెయ్యమంటారు? వాళ్లమో వేలమంది. నేనేమో ఒక్కదాన్ని..’ అని నవ్వుతూ అంది.

ఇప్పటివరకు తానెవర్నీ ప్రేమించలేదని, చదువు, సినిమాలే తన ముందున్న లక్ష్యాలని పేర్కొంది. ‘వాలంటైన్స్‌ డే రోజు కూడా కాలేజ్‌కి వెళ్తున్నాను.. తప్పదు.. నాకు అటెండెన్స్ తక్కువ ఉంది. మా కాలేజీలో నన్నెవరూ ప్రేమించరు.. ఎందుకంటే అది అమ్మాయిల కాలేజీ.. నేను బీకాం ఫస్టియర్ చదువుతున్నాను..’ అని చెప్పింది.

ఈ కన్నుకొట్టే సీన్‌తో ప్రియ సినీ జీవితం కూడా మారిపోయింది. ఒరు అదర్‌ లవ్‌  చిత్రంలో నిజానికి ఆమె హీరోయిన్ కాదు. ఓ చిన్న పాత్ర. అయితే ఈ సీన్ మహిమతో ఆమెను హీరోయిన్ ను చేశారని తెలుస్తోంది. మార్చి 3న విడుదల కానున్న ఈ మూవీలో రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌ హీరో కాగా దర్శకుడు ఒమర్‌.