ఆఖరి ఫోన్ కాల్‌తో దొరికిన ప్రియాంక హంతకులు - MicTv.in - Telugu News
mictv telugu

ఆఖరి ఫోన్ కాల్‌తో దొరికిన ప్రియాంక హంతకులు

November 30, 2019

పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుల రిమాండ్ రిపోర్టులో భయానక వాస్తవాలు ఉన్నాయి. దుర్మార్గులు ఆమెను అత్యంత దారుణంగా హింసించి చంపినట్లు తెలిసింది. పోలీసు వర్గాలు తెలిపిన వివరాలు, రిమాండు రిపోర్టులోని వివరాల ప్రకారం.. 

ప్రియాంక మొబైల్ ఫోన్ నుంచి ప్రధాన నిందితుడు మహ్మద్ పాషాకు వెళ్లిన చివరి ఫోన్ కాల్ నిందితులను పట్టుకోవడంతో కీలకంగా మారింది. బుధవారం సాయంత్రం ఆరుగంటలకు ప్రియాంక తొండుపల్లి టోల్ ప్లాజా పక్కన తన స్కూటీని పార్క్ చేయడం చూసిన నలుగురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడాలని పథకం వేశారు. ఆమె రాత్రి 9.18 గంటలకు అక్కడికి రాగానే స్కూటీకి పంక్చర్ అయిందని నాటకం ఆడారు. పాషా మొదట ఆమె వద్దకు వెళ్లి ఫోన్ నంబర్ తీసుకుని, తన నంబర్ ఇచ్చాడు. మరో నిందితుడు జొల్లు శివ స్కూటీకి పంక్చర్ అతికించి తీసుకొస్తానని వెళ్లాడు. రాత్రి కావడంతో ప్రియాంక త్వరగా ఇంటికి వెళ్లాలని వారిని నమ్మి బండి అప్పగించింది. అయితే 15 నిమిషాల తర్వాత కూడా వారి జాడ లేకపోవడంతో పాషా నంబరుకు ఫోన్ చేసింది. ఈ కాల్ ఆధారంగానే పోలీసులు పాషా ఆచూకీని గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన నిందితుల లారీ నంబరు కూడా క్లూగా మారింది. 

remand report.

మద్యం తాగి ఉన్న నిందితులు ప్రియాంకను బలవంతంగా లాక్కుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించగా, నోట్లో బలవంతంగా మద్యం పోశారు. అరవకుండా గట్టిగా నోరు మూసి అత్యాచారానికి తెగబడ్డారు. ప్రియాంక ఊపిరి అందక చనిపోయింది. తర్వాత ఆమె మృతదేహాన్ని దుండగులు లారీలోకి ఎక్కించారు. ఇద్దరు లారీలో, ఇద్దరు ప్రియాంక స్కూటీలో వెళ్లారు. లారీలోనూ నిర్జీవ దేహంపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ కొనడానికి యత్నించారు. అక్కడి సిబ్బంది మీ టూవీలర్ ఎక్కడ అని ప్రశ్నించడంతో వెనుదిరిగారు. ఇండియన్ ఆయిల్ బంకులో పెట్రోల్ కొన్నారు. అత్యాచారం జరిగిన చోటు నుంచి దాదాపు 28 కి.మీ. దూరం వెళ్లి చటాన్ పల్లి వంతెన కింద మృతదేహాన్ని కాల్చేశారు. పూర్తిగా కాలిందో లేదోనని వెనక్కి వెళ్లి చూశారు. తర్వాత స్కూటీని నాట్కో ఫ్యాక్టరీ సమీపంలో పడేసి లారీలో హైదరాబాద్ చేరుకున్నారు. లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులకు అందులో ప్రియాంక వెంట్రుకలు, రక్తం మరకలు కనిపించాయి.