మద్యనిషేధం.. ఒక పల్లె కిలకిలా.. ఒక పల్లె దివాలా.. - MicTv.in - Telugu News
mictv telugu

మద్యనిషేధం.. ఒక పల్లె కిలకిలా.. ఒక పల్లె దివాలా..

April 5, 2018

బిహార్ ప్రభుత్వం రెండేళ్ల కిందట మద్యనిషేధం తీసుకొచ్చింది. చాలామంది జీవితాలు బాగుపడ్డాయి. ఆడవాళ్లు సంతోషంతో పొంగిపోతున్నారు. అయితే మద్యం తయారీనే వృత్తిగా సాగించిన జీవితాలు రోడ్డున పడ్డాయి. కొన్ని గ్రామాలు తాగుడు డబ్బును వేరేవాటిపై ఖర్చు చేస్తూ సుఖసంపదలతో వర్ధిల్లుతుండగా, మరికొన్ని దుర్భర దారిద్ర్యంతో చితికిపోతున్నాయి. పూర్తిగా దివాలా తీసి పరాయి రాష్ట్రాలకు వలసపోతున్నాయి.పూర్ణియా జిలాల్లోని పక్కపక్కనే ఉన్న అలీనగర్, కథోల్ గ్రామాలు ఇందుకు ఉదాహరణ. మద్యనిషేధం వచ్చాక అలీపూర్ ప్రజలు పాడి పరిశ్రమ వైపు మళ్లారు. గిరిజనులు, దళితులు, ముస్లింలు ఇదివరకు మద్యం తయారు చేసేవారు. అయితే మద్యనిషేధం వల్ల భయపడిపోయి.. ఆవులను, గేదెలను కొనుక్కున్నారు. మద్యనిషేధానికి ముందు గ్రామంలో రోజూ 500 లీటర్ల మద్యం తయారవుతుండగా ఇప్పుడు 300 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రజల ఆదాయం పెరిగింది. పూరి గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు లేచాయి.

మరోపక్క…కతోల్ గ్రామం అతలాకుతలమైంది. నిషేధాన్ని ధిక్కరించి చాలామంది మద్యం తయారు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. బెయిలు, విడుదల కోసం వేలు ధారపోసుకున్నారు ప్రజలు. ఇల్లు, పాత్రలు, పశువులు అమ్ముకున్నారు. చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. పదుల సంఖ్యలో పంజాబ్‌కు వలస వెళ్లాయి. ఒక మహిళ అయితే భర్తను జైలు నుంచి విడిపించుకోవడానికి తన పశువులను, మంగళసూత్రాన్ని కూడా అమ్ముకుంది…